వైసీపీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఫ్యాన్ పార్టీకి షాక్ ఇవ్వగా..తాజాగా మరో ఎమ్మెల్సీ జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న జకియా ఖానం రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు.
జకియా ఖానంది అన్నమయ్య జిల్లా రాయచోటి. జకియా ఖానంను 2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేశారు. రెండేళ్ల నుంచి ఆమె వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. జకియా ఖానం రాజీనామాతో వైసీపీకి గుడ్‌బై చెప్పిన ఎమ్మెల్సీల సంఖ్య 6కు చేరింది. ఇప్పటివరకూ కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన వెంటనే జకియాఖానం బీజేపీలో చేరిపోయారు. విజయవాడలో బీజేపీ ఆఫీసుకు వచ్చిన జకియా ఖానం కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ పురందేశ్వరి సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇష్టపడడం లేదు. జగన్ తీరుతో ఒక్కొక్క నేత బయటకు వెళ్లిపోతున్నారు. జగన్ కేసుల్లో విచారణ స్పీడ్ అందుకోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండడంతో వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపిదేవి, విజయసాయి పలువురు రాజ్యసభ సభ్యులు జగన్‌కు షాకిచ్చారు.
ఏపీ మండలిలో 58 స్థానాలుండగా..6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. NDA కూటమికి 13 మంది సభ్యులు ఉన్నారు. మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక వైసీపీకి 34 మంది శాసన మండలి సభ్యులు ఉండగా
దువ్వాడ శ్రీనివాస్‌పై వేటు, జకియా ఖానం రాజీనామాతో ఆ సంఖ్య 32కు పడిపోయింది. మరికొంత మంది ఎమ్మెల్సీలు జకియా ఖానం బాటలోనే పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. వీరిలో చాలా మంది ఎమ్మెల్సీలు ఇప్పటికే ఫ్యాన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది సైలెంట్ అయిపోయారు.











