మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో బిగ్‌షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలో అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులపై క్రిమినల్ కేసులతో పాటు అటవీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తుంటే..అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
చిత్తూరు జిల్లా మంగళంపేటలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూముల ఆక్రమణ నిజమేనని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో 27 ఎకరాల భూ ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఫారెస్ట్ కన్జర్వేటర్లతో కూడిన జాయింట్ కమిటీ తేల్చింది. అనుమతి లేకుండా అటవీ ప్రాంతంలో బోరు తవ్వి, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకున్నారని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇందిరమ్మ, ద్వారకానాథ్‌రెడ్డి పేర్లతో 75.74 ఎకరాలకే రిజిస్ట్రేషన్ దస్తావేజులుండగా, పట్టాదారులు 103 ఎకరాలకు కంచె వేసినట్లు కమిటీ గుర్తించింది. అంటే 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్లు పేర్కొంది.
1968 సెప్టెంబరు 16 నాటి మంగళంపేట అటవీ గెజిట్ ప్రకారం 2.413 కిలో మీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.0574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 2.50 కిలో మీటర్ల రహదారి నిర్మించారు. అనుమతించిన దాని కన్నా 87 మీటర్లు అధికంగా దారి వేసినట్లు కమిటీ గుర్తించింది. మంగళంపేటలోని 295, 299 సర్వే నంబర్లలో 75.75 ఎకరాలకు రైత్వారీ పట్టా ఉండగా, 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు, 2017లో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావడం లేదని కమిటీ పేర్కొంది.











