జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టులో మరోసా ఎదురుదెబ్బ తగిలింది.విశాఖలోన రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. హైకోర్టులో ఈ అంశం పై విచారణ పూర్తి అయ్యే వరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టవద్దని జగన్ ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భవనాల నిర్మాణం పేరుతో ఏపీ ప్రభుత్వం రుషికొండను తొలిచేయడం పై ఎంపీ రఘురామ కృష్ణరాజు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ అంశం పై సుప్రీంకోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. మొత్తం కొండను తొలిచేశారని.. పునరుద్ధరించడం సాధ్యం కాదని ఎంపీ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే రిషికొండ పై జరిగిన తవ్వకాలకు సంబంధించన తాజా ఫొటోలను లాయర్ బాలాజీ శ్రీనివాసన్ కోర్టు ముందు ఉంచారు. ఫోటోలను పరిశీలించిన జస్టిస్ గవాయ్, జస్టిస్ హిమాకోహ్లి ధర్మాసనం రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని, అంతవరకు కేవలం పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలో మాత్రమే కొత్త నిర్మాణాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అదేసమయంలో రుషికొండ తవ్వకాల విషయంలో ఇప్పటికే హైకోర్టులో ధిక్కరణ పిటిషన్ పెండింగ్‌లో ఉందని బాలాజీ శ్రీనివాసన్ సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించారు.
ఇదే అంశం పై జరిగిన వాదనల్లో పిటిషన్‌లో మీరెందుకు చేరకూడదని ధర్మాసనం రఘురామ కృష్ణంరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ప్రశ్నించింది. తవ్వకాలు తప్పని తేలితే వాళ్లు జైలుకు వెళతారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని, ఇప్పుడు కనుక ఎన్జీటీ స్టే ఎత్తేస్తే ముప్పు వాటిల్లే ప్రమాదముందని లాయర్ బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు.
గత కమిటీ నివేదికలో అంశాల ఆధారంగా ఎన్జీటీ తాజాగా మరో కమిటీని నియమించిందని.. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వస్తుందా లేదా?.. కొండను తొలిచేయడం మంచిదా కాదా తెలుసుకోవడానికే.. ఎన్జీటీ తాజా కమిటీని నియమించినట్టు బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు వెల్లడించారు. హైకోర్టు, ట్రైబ్యునల్, సుప్రీంకోర్టు…. ఒక్కోటి ఒక్కో ఉత్తర్వులు ఇస్తే ఎలా?.. హైకోర్టుకు వెళ్లవచ్చు కదా అని ధర్మాసనం సూచించింది. నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. మొత్తం కొండలు ఎలా తొలిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతుల ప్రకారమే నిర్మాణాలు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. ఫోటోలు చూస్తే… అలా కనిపించడం లేదని.. పాత ఫోటోలు.. కొత్త ఫోటోలు అన్నీ ఉన్నాయి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. అక్కడ ఉన్న పచ్చదనం అంతా మాయమైందని వ్యాఖ్యానించింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ వాదనలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భవనాల నిర్మాణం వేరు కొండను తొలిచేయడం వేరు అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. రిసార్టు నిర్మాణానికి మొత్తం కొండలు తొలిచేస్తే ఎలా అని ఉన్నతన్యాయస్థానం ప్రశ్నించింది. మైదాన ప్రాంతంలో నిర్మాణం వేరు.. ఇలాంటి కొండపైన నిర్మాణం చేయడం వేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్మాణాలకు సంబంధించి వ్యవహారమంతా… ఫొటోలు చూపుతున్నాయని పేర్కొంది. నిర్మాణాలకు మాత్రం అనుమతిస్తామని… కానీ, కొండను, అక్కడ ఉన్న పర్యావరణానికి.. ముప్పు లేకుండా చేపడతామని హామీ ఇవ్వగలరా అని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు.