అసెంబ్లీ సమావేశాలను ఈరోజు నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కరోనా తగ్గుతున్నా కూడా ఇంకా ఆందోళన ఉన్నందున ఎన్ని రోజులు పాటు అసెంబ్లీ కొనసాగనుందనేది స్పష్టత రావడం లేదు. మామూలుగా అసెంబ్లీ ఆరంభం అయ్యాక ఆందోళనలు, నిరసనలు ఊపందుకుంటాయి. కానీ, ఈసారి అందుకు భిన్నంగా అసెంబ్లీ, మండలి సమావేశాలకు హాజరు కావడమే ఆందోళనలతో చేరుకున్నారు ప్రతిపక్షాలు.
రైతులే అజెండా
పెను తుఫాన్లకు రాష్ట్రం చిగుటాకులా వణికిపోయింది. అకాల వర్షాలకు రైతాంగం నిలువునా మునిగిపోయింది. చేతికందొచ్చిన పంట నీటిపాలవడంతో రైతుల బాధ వర్ణణాతీతం అని చెప్పాలి. పంట నష్టం ఇంతొచ్చింది, ఇన్ని ఎకరాలు నీట మునిగాయి అని లెక్కలేయడమే కానీ, రైతుల లెక్క తేల్చిన వారు లేరు. వారి చేతికి చిల్లిగవ్వ అందింది లేదు. అసెంబ్లీ ఆరంభిస్తున్న సమయంలో రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలిపే విధంగా ఆందోళన చేపట్టింది ప్రతిపక్షం. నీట మునిగిన పంటను చేతబట్టి, వారి డిమాండ్ల ప్లకార్డుతో అసెంబ్లీ ప్రాంగణాన్ని కాసేపు ఛలో అసెంబ్లీ రీతిని తలపించారు.
ప్రభుత్వం రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పంటకు 25 వేలు, ఉద్యాన పంటలకు 50 వేలు, ముంపు బాధితులకు 10 వేలు ఇవ్వాలని డిమాండు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు నివాళులర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
అమరావతి నిరసన శెగ
అమరావతి రైతుల నిరసన 349వ రోజుకు చేరుకుంది. వారు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మార్గంలోనే సిఎం అసెంబ్లీకి వెళ్లాల్సి ఉండడంతో పోలీసులను భారీగా మోహరించారు. ముఖ్యమంత్రి జగన్ వస్తున్న సమయంలో రైతులు తమ ఆందోళనను తెలియజేశారు. పచ్చ జెండాలను పట్టకుని తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈసారైనా ఉపయోగం ఉంటుందా
అసెంబ్లీ సమావేశాలంటే ఏదో పిచ్చాపాటీగా కలిసి మాట్లాడుకున్నమా అన్నట్లు తయారైంది. మాకు బలముంది కనక మాకు నచ్చిన బిల్లులకు ఆమోదం తెలుపుకుంటాం అన్నట్లుంది ప్రభుత్వం తీరు. ప్రతి పక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు మాపని కాదన్నట్లు ఉంది. ప్రజలకిచ్చిన హామీలలో 20 పథకాలు పూర్తి చేసినట్లు అసెంబ్లీలో చర్చకు తీసురాబోతుంది ప్రభుత్వం. వాటిపై చర్చించబోతుంది. దీనితో పాటు 12 బిల్లులతో ప్రభుత్వ ఎజెండా సిద్ధం. ప్రతి పక్షం కూడా అంతే వ్యూహాత్మకంగా రంగం చేసినా ప్రభుత్వం లెక్కచేస్తుందా అసలు సమాధానాలు చెప్తుందా అనేదే పెద్ద ప్రశ్న?