ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో 12 బిల్లులు పాస్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. మొదటి రోజు గానగంధర్వుడు ఎస్పీ బాలు మృతికి సభలో సంతాపం ప్రకటించనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కరోనాతో చనిపోయిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ తో పాటు , ఇటీవల చనిపోయిన మరికొందరు మాజీ ప్రజాప్రతినిధులకు సభలో సంతాపం ప్రకటించనున్నారు.
ఒకటిన్నర సంవత్సరాల పాలనపై చర్చ
వైసీపీ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా శాసనసభలో చర్చించాలని అధికార పార్టీ భావిస్తోంది. ప్రతిపక్ష సభ్యులను అడ్డుకునేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న 20 సంక్షేమ పథకాలను చర్చకు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నవరత్నాల ద్వారా నగదు బదిలీ పథకాలపై చర్చతో నాలుగు రోజులు కాలక్షేపం చేసి చివరి రోజు బిల్లులన్నీ ఒకేసారి ఆమోదించుకోవాలని వైసీపీ ప్రణాళిక వేసినట్టు తెలుస్తోంది.
పక్కదారి పట్టిస్తారా?
ఏపీలో ప్రధానంగా తుపానులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఏదైనా అంశం చర్చకు పట్టుపడితే, ప్రభుత్వం చేపడుతోన్న 20 సంక్షేమ పథకాలను చర్చకు తీసుకోవాలని వైసీపీ వ్యూహంగా ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీనిపై టీడీపీ చర్చకు డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రధానమైన అంశం పోలవరం ప్రాజెక్టులో ఎంత వరకు నీరు నిల్వ చేస్తారు, అనే అంశంపై చర్చకు పట్టుపట్టే అవకాశం ఉంది. పోలవరం ఎత్తు సెంటీమీటరు కూడా తగ్గదని చెబుతోన్న ప్రభుత్వం, ఇక పోలవరంలో నీటి నిల్వలపై చర్చకు అనుమతిస్తుందా? లేదా వేచిచూడాల్సిందే?
మండలిలో బిల్లులు గట్టెక్కుతాయా?
మండలిలో నేటికీ వైకాపాకు మెజారిటీ లేదు. దీంతో మండలిలో బిల్లులు గట్టెక్కుతాయా? లేదా? అనే అనుమానం నెలకొంది. మండలిలో టీడీపీ సభ్యులను అంకెలగారఢీతో అడ్డుకునేందుకు మండలి సభా నాయకుడిగా బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిని నియమించారు. ఐదు రోజుల పాటు జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు వేడివేడిగా సాగే అవకాశం ఉంది.