గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం యావత్ దేశ సినీలోకాన్ని విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడిన బాలసుబ్రహ్మణ్యం చెన్నై లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి దాదాపు 50 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 25న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన ఒకే ఒక సింగర్ బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎన్నో జాతీయ, రాష్ట్ర అవార్డులు, రివార్డులు పొందారు. బాలు విజయాలను ప్రస్తావిస్తూ ఏపి సిఎం జగన్.. బాలుకి భారతరత్న ఇవ్వాలని పిఎంకు లేఖరాశారు.
ప్రధానికి జగన్ లేఖ..
బాలు మరణానంతరం ఆయనకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కొన్నిరోజులుగా ఊపందుకుంది. ఇదే విషయం పైన ఏపీ సీఎం జగన్ కోరుతూ ఎస్సీ బాలుకి భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోడీకి సోమవారం లేఖ రాశారు. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని ఆ లేఖలో ఆయన కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. జగన్ రాసిన లేఖలో బాలు తన సినీ జీవితంలో సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన వ్యక్తిగా కొనియాడారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందిన విషయాన్ని కూడా జగన్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఏ సినీ కళాకారుడు సాధించనన్నీ విజయాలను బాలు సాధించారని కీర్తిస్తూ, బాలుకి భారతరత్న ఇవ్వాలని సిఎం జగన్ కోరారు. ఎస్పీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసింది మొదట సినీఇండ్రస్టీ నుంచి హీరో అర్జునే. తన తండ్రికి భారతరత్న ఇస్తే సంతోషిస్తానని ఎస్పీ చరణ్ కూడా దీనిపై ఓ ప్రకటన చేశారు.
జగన్‌కు చంద్రబాబు లేఖ..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ లేఖ రాశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జ్ఞపకంగా నెల్లూరులో సంగీత విశ్వవిద్యాలయం నెలకొల్పాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. అలాగే కాంస్య విగ్రహం ఏర్పాటు-కళాక్షేత్రం అభివృద్దికి కూడా కృషి చేయాలని జగన్‌ను కోరారు. ప్రతి ఏటా బాలు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించి, జాతీయ పురస్కారం ఏర్పాటు చేసి లలిత కళలకు ప్రోత్సహించేలా చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
మా నాన్నగారే ”భారతరత్న”
తమ నాన్నగారి వైద్య బిల్లుల విషయంలో కొన్ని పుకార్లు బయటికి రావడం దురదృష్టకరమని దివంగత బాలసుబ్రహ్మణ్యం తనయుడు చరణ్ అన్నారు. ఎంజిఎం ఆసుపత్రిలో బాలుకి దాదాపు 50 రోజుల వరకు వైద్యులు వైద్యం అందించారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్య బిల్లుల చెల్లింపుల విషయంలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ మీడియాలో స్పందించారు. మా నాన్నగారి హాస్పిటల్ బిల్లులు మొత్తం తానే చెల్లించానన్నారు. హాస్పిటల్ బిల్లులు చెల్లించాలని మేం ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడిని, ప్రభుత్వాన్ని అడిగినట్లు తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. తన తండ్రి గారి మీద గౌరవంతో బ్యాలెన్స్ బిల్ కట్టనవసరం లేదని ఎంజిఎం హాస్పిటల్ యాజమాన్యం చెప్పారని ఆయన పేర్కొన్నారు.
దయచేసి తమ నాన్నగారి విషయంలో కట్టుకథలు సృష్టించవద్దని చరణ్ తెలిపారు. అసలు రూ.3కోట్లు ఏంటో, ఇంకా రూ.1 కోటి 85 లక్షలు చెల్లించాలనే వార్త ఎక్కడినుంచి వచ్చిందో తనకు తెలియడం లేదన్నారు. ఉపరాష్ట్రపతి గారు, వారి కుమార్తె దీపా గారు ఈ విషయంలోకి అసలు ఎందుకు వచ్చారో.. తమ రిలేషన్ బాగుందని, కట్టుకథలతో దాన్ని పాడుచేయకండని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఒప్పుకుంటే భారతరత్న ఇస్తుందన్నారు. మా నాన్నే మాకు భారతరత్న అని ఎస్పీ చరణ్ తెలిపారు.
సినిమా పరిశ్రమకు చెందిన వారు అంత్యక్రియలకు హాజరుకాలేదనే విషయం ఇప్పుడు అవసరంలేదని ఎస్పీ చరణ్ కొట్టిపారేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలకు బాలు చేసిన సేవలు అన్ని ఇన్ని కావు. అయితే బాలు అంత్యక్రియలకు చాలా మంది సినీ ప్రముఖులు హాజరు కాలేకపోయారు. ఈ విషయంపై చరణ్ స్పందిస్తూ ఇప్పుడది అనవసరమైన విషయని కొట్టిపారేశారు.