(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలోని పట్టు సాధించేందుకు వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు పెత్తనం సాధించేందుకు ప్రయత్నిస్తూ జగన్‌కు తలనొప్పి తెస్తున్నారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుండే వ్యక్తమవుతున్నాయి.
కింజరాపు అడ్డా ..
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అడ్డగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా వెలుగొందుతున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో పాగా వేయాలని వైసీపీ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్నపై పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్‌ను నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. ఇదే అదునుగా నియోజకవర్గంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాలు, సభలు సమావేశాలు, సమీక్షలు అన్నీ తన కనుసన్నల్లోనే నిర్వహిస్తూ టెక్కలిలో దువ్వాడ తన పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని నిశితంగా పరిశీలిస్తున్న స్థానిక వైసిపి నాయకులు, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి టెక్కలిలో తమ పట్టు కోల్పోకూడదని, దువ్వాడ పెత్తనానికి ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఎవరికి వారు పెత్తనం చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు సమిధలు అవుతున్నట్టు భోగట్టా.
సీఎం జోక్యంతో ..
టెక్కలిలో తనకున్న పట్టు నిరూపించుకునేందుకు కిల్లి కృపారాణి ఇటీవల భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిసింది. బిసీ కార్పొరేషన్ల పందేరంలో శ్రీకాకుళం జిల్లాకు అత్యధికంగా ఆరు పదవులు ఇచ్చినందున కృతజ్ఞతాభినందన సభ టెక్కలిలో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొడాలి నానితో పాటు ఇతర ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను ఆహ్వానించేందుకు నిర్ణయించారని భోగట్టా. ఈ సమావేశానికి దువ్వాడ శ్రీనివాస్‌ను మాత్రం ఆహ్వానించలేదని సమాచారం. చివరి క్షణం వరకూ వేచి చూసిన దువ్వాడ నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీఎం కల్పించుకుని విజయసాయిరెడ్డిని సమావేశానికి వెళ్లవద్దని సూచించడంతో పాటు, స్థానిక ఇన్‌ఛార్జికి తెలియకుండా సమావేశం నిర్వహించేందుకు నిర్ణయించడంపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఆ నేపథ్యంలో సభ అర్థాంతరంగా రద్ధయినట్లు భోగట్టా.
ఏదేమైనా టెక్కలిలో ఉంటున్న ఈ ముగ్గురు వైసీపీ నాయకుల మధ్య ఆ పార్టీ కేడర్‌తో పాటు అధికారులు ‘అడకత్తెరలో పోక చెక్క’ మాదిరిగా నలిగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీ అధినేత పరిస్థితిని ఏ విధంగా సరిదిద్దుతారో వేచి చూడాలి.











