ఏపీలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం (మారిటైం) పరుగులు పెడుతోంది. విదేశీ దిగ్గజ కంపెనీలు, దేశీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధులలోత ఏపీ మారిటైం బోర్డు అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఏపీలో సుమారు 974 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీరం ఉంది. దీన్ని ఉపయోగించుకుని పోర్టు ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం.
మారిటైం రంగం అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు షిప్ బిల్డింగ్, బ్రేకింగ్ యూనిట్ల ఏర్పాటు, అనుబంధ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు..ఏపీ మారిటైం బోర్డు ఇటీవల EOI ఇచ్చింది. ఐతే పిలుపునకు విదేశీ దిగ్గజ కంపెనీలతో పాటు.. దేశీయ సంస్థల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు 21 సంస్థల నుంచి ప్రతిపాదనలు అందాయి. వాటిలో కనీసం 10 సంస్థల నుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మారిటైం రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
మారిటైం బోర్డు ఇచ్చిన EOI ప్రకటనకు స్పందించిన కొన్ని సంస్థల ప్రతినిధులు యూనిట్ల ఏర్పాటుకు అనువైన భూములను పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల పరిసర ప్రాంతాలతో పాటు..మరికొన్ని చోట్లా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు గోవా పోర్టు లిమిటెడ్ ఇప్పటికే ఆసక్తి చూపింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు..అధికారులతో సాగిస్తున్న సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి. స్థలం ఎంపిక కూడా దాదాపు పూర్తయినట్లు తెలిసింది. కొన్ని విదేశీ కంపెనీల ప్రతినిధులూ భూముల పరిశీలనకు వచ్చినట్లు అధికారులు చెప్పారు.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మోటుమర్రి దగ్గర పోర్టు ఆధారిత క్లస్టర్ అభివృద్ధికి కొన్ని సంస్థలు ఆసక్తి చూపాయి. అందుకు అనువైన ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా పోర్టు ప్రాక్సిమల్ ఏరియా అభివృద్ధికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న..నిర్మాణంలో ఉన్న వాటితో కలిపి ఆరు పోర్టుల పరిధిలో 8 పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని ఏపీ మారిటైం బోర్డు నిర్ణయించింది. వాటిలో గోదాములు, లాజిస్టిక్ సదుపాయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ను మారిటైం బోర్డు తయారు చేయిస్తోంది.
పోర్టు నుంచి 25 కి.మీ. పరిధిలో ప్రాక్సిమల్ నగరాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. అందులో షిప్ బిల్డింగ్, షిప్ బ్రేకింగ్ యూనిట్లు, ఆధునిక షిప్‌యార్డులు, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. వాటి ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా మారిటైం రంగం అభివృద్ధికి అనువైన వాతావరణాన్ని తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన కంపెనీలివే-
ఇమాబరి షిప్ బిల్డింగ్ కంపెనీ లిమిటెడ్ – భారీ షిప్‌ల తయారీ సంస్థ – జపాన్
హన్వా ఓషియాన్… కమర్షియల్ షిప్‌ల నిర్మాణ సంస్థ – సౌత్ కొరియా
మోల్లెర్ మెర్క్స్…కంటెయినర్ షిప్, లాజిస్టిక్ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగిన సంస్థ – నెదర్లాండ్స్
పీ అండ్ పీ…మారిటైం రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సంస్థ – గ్రీస్
హుందాయ్ హెడీడీ షిప్ బిల్డింగ్… భారీ షిప్‌ల నిర్మాణ సంస్థ – సౌత్ కొరియా











