వైసీపీ హయాంలో ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఐతే ఇదే విషయంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్‌లో సిట్ విచారణ కేవలం డిస్టిలరీల చుట్టే తిరుగుతోందన్న షర్మిల..మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అన్ని దశల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. అసలు నగదు రూపంలోనే ఎందుకు లావాదేవీలు నిర్వహించారో సిట్ అధికారులు ఆరా తీస్తే..స్కామ్ ఎంత పెద్దదో తెలుస్తుందన్నారు. ఎంత సేపు..కమిషన్లు, లంచాల గురించే చెబుతున్నారు కానీ.. నగదు లావాదేవీల వెనుక జరిగిన అసలు స్కాం గురించి ఆలోచించడం లేదన్నారు
సిట్ చెబుతున్న ప్రకారం లిక్కర్ స్కామ్ విలువ రూ.3,500 కోట్లకే పరిమితం కాదన్నారు షర్మిల. దాదాపు లక్ష కోట్ల మేర అవినీతి జరిగిందంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన నాసిరకం లిక్కర్ బ్రాండ్స్ కారణంగా ఏపీలో దాదాపు 30 లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారని, అనధికారిక లెక్కల ప్రకారం 30 వేల మంది వరకు మరణించారని ప్రభుత్వమే చెప్పిందన్నారు షర్మిల. ఈ కోణంలోనూ విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.
జగన్ సర్కార్ క్యాష్ రూపంలో లావాదేవీలు నిర్వహించి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని భారీగా అమ్మి రూ.వేల కోట్లు దోచేసిందన్నారు షర్మిల. ఇదో పెద్ద ఆర్థికనేరమని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో నగదు చెల్లింపు పద్ధతిని మాత్రమే అమలు చేశారు. ఈ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ అనడం ఎక్కడా లేదు. నమ్మకమైన కంపెనీలవి కాకుండా నాసిరకం మద్యం విక్రయించారు. అలాంటి కంపెనీలకే అనుమతులిచ్చి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడారని మండిపడ్డారు.
మద్యం కుంభకోణంపై జగన్ ఇప్పటికైనా నోరు తెరవాలన్నారు షర్మిల. జవాబు చెప్పాల్సిన పాయింట్‌ను పక్కన పెట్టి, ఇతర అంశాలు మాట్లాడటం జగన్‌కు అలవాటని చురకలు అంటించారు. విశాఖలో రుషికొండను ఎందుకు విధ్వంసం చేశారో ఇంతవరకు జగన్ చెప్పలేదన్నారు షర్మిల. వివేకా హత్య విషయంలో ‘సాక్షి’ గుండెపోటు అని చెబితే..దానిపైనా జగన్ మౌనమే వహించారని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించిన పాపం కూడా జగన్‌దే అన్నారు షర్మిల.











