ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతోనూ ఇవాళ సమావేశం కానున్నారని తెలుస్తోంది. తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు, రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు ఇతర మంత్రులతో సమావేశమైన సీఎం చంద్రబాబు విశాఖపట్నం మెట్రో రైల్, బీచ్ కారిడార్, రాయలసీమ హార్టికల్చర్ హబ్, పోలవరం ప్రాజెక్టు, గోదావరి పుష్కరాల నిధుల మంజూరుపై ప్రధానంగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, నౌకాయాన శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌లతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, దీర్ఘకాలిక సమస్యలపై చర్చించనున్నారు.
ఇక, ఈ పర్యటనలో CII భాగస్వామ్య సదస్సు కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. రాష్ట్రానికి భారీగా పారిశ్రామిక పెట్టుబడులను రాబట్టడమే ధ్యేయంగా ఈ సదస్సులో గ్లోబల్ పెట్టుబడిదారులతో సీఎం నేరుగా భేటీ కానున్నారు.
రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, కేంద్రం సాయంతో సాగుతున్న పరిపాలన తీరును పారిశ్రామికవేత్తలకు సీఎం వివరించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి కేంద్ర సాయం సాధించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ ఢిల్లీ పర్యటన ముగిశాక సీఎం అమరావతికి తిరుగుపయనమవుతారు.











