నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాల్లో ప్రారంభించి దశలవారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూసమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములూ తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చ.కి.మీ. పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలనుబట్టి తదుపరి భూసమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది.
ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా CRDA దగ్గర రెండు వేల ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు
వస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4 వేల ఎకరాలు కావాలని అంచనా. ఓ పక్క రాజధాని అవసరాలు పెరుగుతుండడం, మరోపక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూసమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒకపక్క సరిహద్దుగా నది ఉంది…దానిని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూసమీకరణ చేసేశారు. మిగతా రెండు వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది.
2 వేల ఎకరాలు చాలదు –
రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37 వేల 941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా..కొంత పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకూ 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-19 మధ్య సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్షియానికి ప్రభుత్వం 1,691 ఎకరాలు కేటాయించింది. జగన్ ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దుచేసుకుని తరిమేసింది.
మళ్లీ స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకవేళ సింగపూర్ సంస్థలు ముందుకు రాకపోతే, వేరే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి స్టార్టప్ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాని కోసం గతంలో కేటాయించిన 1,691 ఎకరాలను అలాగే ఉంచుతోంది. జగన్ ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను విధ్వంసం చేయడమే లక్ష్యంగా అమరావతిలో ఆర్ 5 జోన్‌ను సృష్టించి, 1,500 ఎకరాల్లో బయటి ప్రాంతాలకు చెందినవారికి అక్కడ ఇళ్ల పట్టాలిచ్చింది. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండటంతో..CRDA ఆ భూముల జోలికి వెళ్లడం లేదు.
రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాల్లో మట్టి తవ్వేందుకు వివిధ గుత్తేదారు సంస్థలకు సీఆర్‌డీఏ గతంలో అనుమతులిచ్చింది. అక్కడ చాలా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ 300 ఎకరాలు కూడా తక్షణం ఉపయోగపడవు. భవిష్యత్తులో అక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ప్రాజెక్టు చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో…విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. బిట్స్, XLRI వంటి సంస్థలు భూములు కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు సైతం పెద్ద ఎత్తున భూములు కావాలి.
భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక ప్లాన్ కూడా ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్‌రోడ్డుతోపాటు అవుటర్ రింగ్‌రోడ్డునూ నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడినుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. మరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేకపోవడం, భూముల కోసం డిమాండ్‌లు పెరుగుతుండటం, CRDA దగ్గర అపరిమితంగానే భూమి ఉండటం, సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.
ఎయిర్‌పోర్టుకు 4 వేల ఎకరాలు –
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని MRO సదుపాయం, శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. దీనికి సుమారు 4 వేల ఎకరాలు కావాలని అంచనా. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తికనబరిచింది