బీసీల అభివృద్ధికి మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చింది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా వారికి మొదట పెద్దపీట వేసింది. తాజాగా మరోసారి ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉన్న బలహీనవర్గాల రక్షణ, అభ్యున్నతికి ఇప్పటికీ,ఎప్పటికీ కట్టుబడి ఉంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వారికి పూర్తి అండగా ఉంటామని..బీసీల రక్షణ కోసం త్వరలోనే చట్టం తీసుకోస్తామన్నారు. బీసీలను అన్ని వర్గాలతో సమానంగా..అవసరమైతే అందరికంటే ముందుండే విధంగా తయారు చేయడమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమం కూడా నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ నుంచి తొలి విడతగా రూ.275 కోట్ల రుణాలను లబ్ధిదారులకు విడుదల చేశారు.
బీసీ చట్టంపై ఇప్పటికే సబ్‌కమిటీ వేశామని, నివేదిక రాగానే ఆ చట్టం తీసుకొస్తామని బీసీ సబ్‌ప్లాన్ కింద ఈ ఏడాది రూ.48వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు చంద్రబాబు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించడంతో ఆదరణ-3 ద్వారా చేతివృత్తులు, కులవృత్తుల మనుగడకు కృషి చేస్తామన్నారు. బలహీన వర్గాల ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో సివిల్ సర్వీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, 500 మందికి ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల కోసం రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని..పెండింగ్‌లో రూ.76కోట్లు ఉంటే వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని చెప్పారు. డీఎస్సీలో ఎక్కువ మంది బీసీలు ఉత్తీర్ణులయ్యేందుకు 5,720మందికి శిక్షణ కార్యక్రమాలు పెడతామన్నారు. ఆదరణ-3 కింద ఏటా రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు.
వెనుకబడిన వర్గాల్లో కులవృత్తులు పోయాయన్నారు చంద్రబాబు. చేతి వృత్తులు దెబ్బతింటున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బీసీల ఆదాయం పెంచేందుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కల్లుగీత కార్మికులకు మద్యం షాపులలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. వారికి ఫీజుల్లోనూ 50 శాతం రాయితీ కల్పించి ఎక్కువ ఆదాయం వచ్చేలా చేశామన్నారు. చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు.
వెనుకబడిన వర్గాలు ఇళ్లు కట్టుకుంటే అదనంగా రూ.50 వేలు సబ్సిడీ ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీలు పైసా చెల్లించకుండా సూర్యఘర్ యూనిట్లు పెట్టుకోవచ్చని చెప్పారు. బీసీలకు కూడా ఇంటిపైనే కరెంటు ఉత్పత్తికి సోలార్ ఫలకలు పెట్టిస్తామన్నారు. దేవాలయాల్లో పని చేసే నాయీబ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ.15వేల నుంచి రూ.25 వేలకు పెంచామన్నారు. నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లలో వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు 33శాతం కోటా పెట్టామని చెప్పారు.
ఎంత బాగా అభివృద్ధి చేద్దామనుకున్నా గళ్లా పెట్టే ఖాళీగా ఉందన్నారు చంద్రబాబు. సంపద సృష్టించి..అభివృద్ధి చేయాలన్నారు. పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలన్నారు చంద్రబాబు. అప్పులు తేవాలనుకుంటే ఇచ్చేవారు లేరన్నారు. తనపై ఉన్న నమ్మకంతో ఎంతోకొంత అప్పువస్తోందని..దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 64 లక్షల మంది పేదలకు రూ.33వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇస్తున్నామని చెప్పారు. ఏపీలో రూ.4వేలు ఇస్తుంటే తెలంగాణ ఇచ్చేది రూ.2,600 మాత్రమేనన్నారు. ఏపీలో దివ్యాంగులకు రూ.6 వేలు, కిడ్నీ రోగులకు రూ.10 వేలు, మంచానికే పరిమితం అయితే రూ.15 వేలు ఇస్తున్నామని చెప్పారు. ఆ రోజున నా మానస పుత్రికగా డ్వాక్రా సంఘాలు పెట్టానని గుర్తు చేశారు.
పొదుపు ఉద్యమం నడిపానన్నారు. ఈ ఏడాది లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసే బాధ్యత తీసుకున్నామని చెప్పారు. నా తల్లి కట్టెల పొయ్యితో పడిన బాధ కళ్లారా చూశానని భావోద్వేగానికి గురయ్యారు. ఆ బాధ నా చెల్లెళ్లు పడకూడదనే 1996-97లో దీపం-1 పెట్టానన్నారు. సూపర్-6 హామీలో భాగంగా దీపం-2 కింద ఏటా 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నామని గుర్తు చేశారు. రేపో ఎల్లుండో తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని స్పష్టం చేశారు.
ఇక ఇటీవల సోషల్‌మీడియాలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. రాజకీయాలు దిగజారిపోయాయన్నారు. సోషల్‌మీడియాలో ఆడబిడ్డలపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయిందన్నారు. సామాజిక మాధ్యమాల్లోల వ్యక్తిత్వ హననం చేసే వ్యక్తులకు ఇదే చివరి రోజని వార్నింగ్ ఇచ్చారు. తాను కూడా సోషల్‌మీడియా వల్ల కొన్ని సార్లు పొరబడ్డానన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడన్న వార్తను చూశానని, కానీ అది గొడ్డలి పోటని తెలుసుకునేందుకు చాలా సమయం పట్టిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వచ్చేవరకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగలేదన్నారు. బీసీలు పూర్తిగా నష్టపోయారని, వారికి గుర్తింపు లేదని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. వారికి న్యాయం చేసిన ఏకైక పార్టీ టీడీపీయేనన్నారు. వెనుకబడిన వర్గాల పిల్లల్లో మాణిక్యాలు ఉన్నారని..వారికి సరైన చేయూతనిస్తే బ్రహ్మాండంగా రాణించగలుగుతారన్నారు. ప్రతి ఒక్కరికీ ఇళ్లు కట్టించిన తర్వాతే మళ్లీ ఓటు కోసం వస్తా. నివాసయోగ్యమైన ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు.