వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సౌర, పవన్ విద్యుత్ ఒప్పందాల్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీవ్ర అవకతవకలకు పాల్పడిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆరు నెలలపాటు సౌర, పవన విద్యుత్ కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను కూడా ప్రభుత్వం తీసుకోలేదు. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి దారులతో ప్రభుత్వం పీపీఏలు చేసుకుని ఉండటంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఏపీ ప్రభుత్వం దిగి వచ్చింది. గ్రీన్ ఎనర్జీ కొనుగోళ్లు ప్రారంభించింది.
నాడు తప్పనిపించిన నిబంధనలే కొత్త జీవోలో చేర్చారు..
చంద్రబాబునాయుడు ప్రభుత్వం సౌర, పవన్ విద్యుత్ కంపెనీలతో 25 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకున్నారని, దీని వల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ అజేయకల్లాం రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ గగ్గోలు పెట్టారు. రెండు దశాబ్దాల కిందట ఒక్క యూనిట్ సౌర విద్యుత్ ఉత్పత్తి ఖర్చు రూ.20 రూపాయలుగా ఉండేదని అది నేడు రూ.7కు తగ్గిందని, రాబోయే కొన్ని సంవత్సరాల్లో సౌర, పవన్ విద్యుత్ చౌకగా లభ్యం అవుతుందని, ప్రభుత్వం 25 సంవత్సరాలపాటు ఒప్పందాలు చేసుకోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజేయకల్లాం రెడ్డి చాలా చక్కగా ఉదాహరణలతో సహా మీడియాకు వెల్లడించారు.
అదే ప్రభుత్వం నేడు జీవో 25 తీసుకు వచ్చి సౌర, పవన విద్యుత్ ఒప్పందాలను 30 సంవత్సరాలకు పెంచారు. ఆనాడు 25 సంవత్సరాల ఒప్పందాల వల్లే నష్టం వస్తుందన్న వైసీపీ పెద్దలు, నేడు అవే ఒప్పందాలను 30 సంవత్సరాలకు పెంచితే రాదా? అని ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యత్ ఒప్పందాలను కనీసం 25 సంవత్సరాలకు తగ్గకుండా చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఆనాడు టీడీపీ ప్రభుత్వం 25 సంవత్సరాలకు పీపీఏలు చేసుకుందని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడా లేదు
విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో పీపీఏలు చేసుకునే ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒప్పందం చేసుకున్న ధరకు విద్యుత్ కొనుగోలు చేయాలి. ఒక వేళ ఆయా కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే ప్రభుత్వం ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కానీ కొత్తగా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 25 ప్రకారం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినా పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. ఈ నిబంధన దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. ఎవరి ప్రయోజనం కోసం ఇలాంటి సదుపాయాలు పెట్టారని మాజీ విద్యుత్ శాఖా మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. విద్యుత్ కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తామని చెప్పడంపైనా కూడా కళా వెంకట్రావు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు.
గ్రాంట్లు నేరుగా ఇవ్వడం ఎక్కడైనా ఉందా?
పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లను నేరుగా డెవలపర్లకు ఇస్తామని నిబంధనల్లో పెట్టడంపై కూడా ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గత ప్రభుత్వం ఎకరా లీజు రూ.31 వేలుగా నిర్ణయించింది. తాజాగా దీన్ని రూ.25 వేలకు తగ్గించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచేందుకేనని ప్రభుత్వం చెప్పుకుంటోంది. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన తాజా జీవో 25 అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీయడం ఖాయమని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇంత కరెంటు ఏం చేసుకుంటారు?
ఏపీలో పరిశ్రమలు తరలిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీలో విద్యుత్ వినియోగం 12 వేల మెగావాట్లు మాత్రమే. మరో 20 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ తీసుకునేందుకు పలు సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయి. వీటికి అధనంగా మరో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ లు చేసుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై విద్యుత్ ఉద్యోగం సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రస్తుతం ఉన్న విద్యుత్ కే కొన్ని సమయాల్లో డిమాండ్ లేక థర్మల్ కేంద్రాలకు హాలిడే ప్రకటించారు. మరో 20 వేల మెగావాట్ల సౌర, పవన్ విద్యుత్ ప్లాంట్లు సిద్దమవుతున్నాయి. వీటికి అదనంగా మరో పదివేల మెగావాట్లకు అనుమతులు ఇవ్వడం అంటే విద్యుత్ రంగమే కాదు ఏకంగా రాష్ట్రమే దివాలా తీస్తుందని విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు.
బ్యాంకులను ముంచడానికేనా…
రూపాయి ఖర్చు లేకుండా వేల కోట్లు కాజేసేందుకే మొత్తం 30 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను పెడుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ ప్లాంట్లకు కావాల్సిన భూమి ప్రభుత్వం సేకరించి లీజుకు ఇస్తుంది. అంటే ప్లాంటు పెట్టే వ్యక్తి భూమి కొనాల్సిన పనిలేదు. ఇక గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం రాయితీలతోపాటు, బ్యాంకు రుణాలు కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాయి. అంటే పెట్టుబడిదారులు కోట్లాది రూపాయలు వెచ్చించాల్సిన పని లేకుండానే వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టేస్తున్నారు.
విద్యుత్ కొనుగోలుకు పీపీఏలను బ్యాంకులకు చూపించి వేల కోట్లు రుణాలను తీసుకుంటున్న వారు.. ఆయా ప్లాంట్లను ఎన్ని సంవత్సరాలు నడుపుతారో అర్థం కావడం లేదు. ప్రస్తుత ఖర్చుల ప్రకారం ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు రియల్‌గా అయ్యే ఖర్చు రూ.4.8 కోట్లు మాత్రమే. పెట్టుబడిదారులు ప్రభుత్వానికి, బ్యాంకులకు చూపే ఖర్చు మాత్రం రూ.7.8 కోట్లు. అంటే వెయ్యి మెగావాట్ల ప్లాంట్ పెట్టుకుంటే ప్రారంభ లాభం రూ.3 వేల కోట్లు. ఇక మొత్తం 30 వేల మెగావాట్ల ప్లాంట్లు పూర్తి చేస్తే ఇందులో జరిగే దోపిడీయే 90 వేల కోట్లు ఉంటుందని విద్యుత్ రంగ నిపుణుడు రఘు వెల్లడించారు. అంటే ఏపీలో జీవో 25 ద్వారా భారీ దోపిడీకి తెరలేపారని తెలుస్తోంది.