సంగీత సాహిత్యాలను కలుపుకుని అందమైన కథను అద్భుతంగా ఆవిష్కరించేది ‘నాట్యం’. అలాంటి నృత్య ప్రధానమైన కథతో ‘నాట్యం’ సినిమా రూపొందుతోంది. ఇది నాయిక ప్రధానంగా సాగే కథ. ప్రధానమైన పాత్రను సంధ్య రాజు పోషిస్తున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు.
ఎన్టీఆర్ చేతుల మీదుగా కొంతసేపటి క్రితం ఈ టీజర్ విడుదలైంది. నాట్యప్రధానమైన సన్నివేశాలతోనే ఈ టీజర్ సాగింది. ప్రధానపాత్రలన్నింటినీ కలుపుతూ కట్ చేసిన ఈ టీజర్ ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘నాట్యం’ అంటే ఒక కథను అందంగా చెప్పడం’ అనే డైలాగ్ ను హైలైట్ చేస్తూ టీజర్ నడిచింది. అంతేకాదు .. ఇది ఓ ‘కాదంబరి’ కథ అంటూ, నాయిక జీవితం చుట్టూ .. ఆమె ఆశయమైన నాట్యం చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. కథలో బలమైన ఎమోషన్స్ ఉన్నాయనే విషయం అర్థమవుతోంది.
టీజర్ ను బట్టే ఈ సినిమాకి ఫొటోగ్రఫీ బాగుందనే విషయం తెలిసిపోతోంది. ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా వ్యవహరిస్తున్న రేవంత్ నే, సినిమాటోగ్రాఫర్ గా .. ఎడిటర్ గా పనిచేయడం విశేషం. భానుప్రియ .. విజయ్ కుమార్ .. శుభలేఖ సుధాకర్ .. కమల్ కామరాజు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చాలా గ్యాప్ తరువాత .. అందునా నాట్య ప్రధానమైన కథలో భానుప్రియ కనిపించనుండటం ఆసక్తికరం. త్వరలోనే ఈ సినిమా ‘దిల్’ రాజు బ్యానర్ పై విడుదల కానుంది. సంధ్య రాజు ప్రయోగం ఏ స్థాయి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
Must Read ;- ఎన్టీఆర్ ను మరిచిపోలేనంటున్న ఉప్పెన హీరో!