ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల సాయాలను, ప్రత్యేక హోదాను తీసుకువస్తానని, తన పార్టీకి 25 ఎంపీ సీట్లివ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పదే పదే చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ లెక్కన తనను గెలిపిస్తే రాష్ట్రానికి న్యాయం చేసేలా చర్యలు చేపడతానన్నదే జగన్ హామీ కదా. మరి రాష్ట్రానికి నష్టం చేకూర్చేందుకు యత్నించిన వారికి కీలక పదవులు ఇవ్వడం ద్వారా… రాష్ట్రానికి న్యాయం మాట దేవుడెరుగు.. అన్యాయం చేస్తున్నట్లే కదా. అంటే.. జగన్ ఏపీకి ద్రోహం చేస్తున్నట్టే కదా. అంతిమంగా జగన్ ఆంధ్ర రాష్ట్ర ద్రోహిగా ముద్ర వేసుకున్నట్టే కదా. ఇదేదో… అదాటుగా అంటున్న మాట ఎంతమాత్రం కాదు. ఇటీవల జగన్ ఓ మహిళను దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ సర్కారుకు సలహాదారుగా నియమిస్తూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలోనే ఈ మాట బాగానే ప్రచారంలోకి వస్తోంది. అదెలాగో చూద్దాం పదండి.
ఏపీకి వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తెలంగాణకు చెందిన ఓ కీలక వ్యక్తి బాగా కావలసిన వ్యక్తి కిందే లెక్క. సాగు నీటి రంగంపై తనదైన శైలిలో అవగాహన పెంచుకున్న ఆయన బీజేపీ అధికారంలోకి రాగానే… పార్టీలో క్రియాశీలకంగా మారిపోయారు. ఆయన అంటే… బీజేపీకి కూడా బోలెడంత ఇష్టం. అందుకే… కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సలహాదారుగా ఆయన నియమితులైపోయారు. అంతే… తన సొంత రాష్ట్రం తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీకి వ్యతిరేకంగా పలు కీలక నిర్ణయాలు వెలువడటంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా వార్తలు వినిపించాయి. ఇందులో తప్పు కూడా ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే… తెలంగాణకు చెందిన సదరు నేత తన సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారంతే. ఏపీ కోణంలో చూస్తే… ఈయన నిర్ణయాల వల్ల ఏపీకి నష్టం జరిగింది కనుక… ఏపీకి ఈయన నష్టకారకుడి కిందే లెక్క. ఆయన పేరేంటంటే… వెదిరె శ్రీరామ్ రెడ్డి. అందరికీ వెదిరె శ్రీరామ్ గానే పరిచయం. ఎందుకనోగానీ… ఆయన తన పేరు చివరన రెడ్డి అనే పదాన్ని మాత్రం పెట్టుకోరు.
శ్రీరామ్ సతీమణి డాక్టర్ చేకుపల్లి శిల్పకు కీలక పదవి
కేంద్ర జలశక్తి శాఖ సలహాదారుగా ఉన్న వెదిరె శ్రీరామ్ సతీమణి డాక్టర్ చేకుపల్లి శిల్పకు ఇప్పుడు ఏపీ సర్కారు ఓ కీలక బాధ్యతలు అప్పగించింది. వృత్తిరీత్యా వైద్యురాలు అయిన ఆమెను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వానికి హెల్త్ అడ్వైజర్ (ఆరోగ్య సలహాదారు)గా నియమిస్తూ జగన్ సర్కారు గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సదరు పదవిని చేపట్టిన శిల్ప… ఇప్పటిదాకా ఏం పనిచేశారన్నది ఏ ఒక్కరికీ తెలియదు. అయినా కూడా ఆమెను అలాగే కొనసాగిస్తున్నారు. ఈ పదవి నేపథ్యంలో వెదిరె శ్రీరామ్… జగన్ కు మరింత దగ్గరయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా… కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయినా… అక్కడ వెదిరె కచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఈ విషయాన్ని ఇటు జగన్ సర్కారు, అటు వెదిరె శ్రీరామ్ బాగానే ప్రచారం చేసుకుంటున్నారు. ఫొటోలు కూడా మీడియాకు విడుదల చేస్తున్నారు.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదా
ఇక్కడ ఇంకో కీలక విషయాన్ని ప్రస్తావించాలి. డాక్టర్ శిల్పను ఢిల్లీలో ఏపీ హెల్త్ అడ్వైజర్ గా నియమించిన జగన్ సర్కారు.. ఆమెకు ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదా కల్పించింది. అంతేకాదండోయ్… ఓ ఐఏఎస్ అధికారిని నామినేటెడ్ పదవిలో నియమిస్తే,… ఇచ్చే హోదాను ఈమెకు కట్టబెట్టారు. ఇలా ఓ వైద్యురాలికి… అందునా ఏపీ ప్రభుత్వంతో ఎంతమాత్రం సంబంధం లేని ఓ మహిళకు ఏకంగా దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు పదవిలో నియమించడం, ఆమెకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి హోదా కల్పించడం చూస్తుంటే… తెర వెనుక పెద్ద మంత్రాంగమే నడిచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఏపీ ప్రభుత్వ సర్వీసులో ఉన్న అధికారికి ఇలాంటి కీలక బాధ్యతలు అప్పగిస్తే ఫరవా లేదు గానీ.. ఏపీతో ఏ కోశానా సంబంధం లేని శిల్పకు ఈ పదవి దక్కడం నిజంగానే అందరినీ షాక్‌కు గురి చేస్తోందని చెప్పక తప్పదు.
ఢిల్లీలో వసతి కోసం
వెదిరె శ్రీరామ్ రెడ్డికి ఢిల్లీలో వసతి కల్పించాలంటే… కేబినెట్ హోదా ఉండాలి. అయితే కేంద్ర జలశక్తి శాఖ సలహదారు పదవి కేబినెట్ ర్యాంకుకు సమానం కాదు. మరేం చేయాలి? తనకు బీజేపీలో ఉన్న పలుకుబడితో జగన్‌కు కేంద్రం పెద్దలతో చెప్పించి మరీ వెదిరె తన సతీమణికి పదవి ఇప్పించుకున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా… తెలంగాణతో సాగు నీటి పంపకాల్లో ఎప్పటికప్పుడు వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో వెదిరెతో స్నేహ సంబంధాలు కొంతమేరకు స్వాగతించేలానే కనిపిస్తున్నా… తెలంగాణకు చెందిన వెదిరె ఏపీకి ఎలా సాయం చేయగలరు. గతంలో కూడా ఆయన తెలంగాణ వాదనలకే మద్దతు పలికారు. ఏపీకి నష్టం కలిగించేలానే కేంద్రం నుంచి నిర్ణయాలు వెలువడేలా చేశారు. మరి అలాంటి వ్యక్తికి ఢిల్లీలో వసతి కోసం నిబంధనలను తోసిరాజని ఆయన సతీమణికి కీలక పదవిని కట్టబెట్టిన జగన్ ఏపీకి ద్రోహిగా కాక మరేమవుతారన్నది ఇప్పుడు జనం నోట నుంచి వినిపిస్తున్న మాట.