వరుసగా కోర్టులతో మొట్టిక్కాయలు తింటున్న ఏపీ ప్రభుత్వానికి మరో చేదు ఫలితం ఎదురయింది. ఆంధ్రప్రదేశ్లో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై విధించిన స్టేటస్ కోని ఎత్తేస్తారని ఆశగా ఎదురుచూసిన జగన్ సర్కార్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. స్టేటస్ కోని వచ్చే నెల 21 వరకు పొడిగించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 11 వరకు ఏపీ ప్రభుత్వానికి కోర్ట్ గడువు విధించింది. ఇదే సమయంలో అభ్యంతరాలు తెలిపేందుకు పిటీషనర్లకు వచ్చే నెల 17 వరకు సమయాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి రోజువారీ విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా యథాతథ స్థితి కొనసాగుతందని ధర్మాసనం చెప్పడంతో ఏపీ సర్కార్ కు భారీ షాక్ తగిలింది.
హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం విశాఖలో అతిధి గృహానికి శంకుస్థాపన చేశారని పీటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందని ఈ విషయం రుజువు చేస్తోందని కోర్టుకు చెప్పారు. దీంతో ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వ సీఎస్ నీలం సహానిని కోర్టు ఆదేశించింది. విచారణ ప్రారంభం కాగానే ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు స్టేటస్ కోని ఎత్తివేయాలని కోరారు. అభివృద్ధి అజెండాగా మూడు రాజధానుల నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని అందులో భాగంగా సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసామని తమ వాదనలను వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. హైకోర్ట్ ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంని ఆశ్రయించడం అందుకు ఉన్నత న్యాయస్థానం ఒప్పుకోకపోవడం సంగతి తెలిసిందే. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో తమ దగ్గరికి రావలసిన అవసరమేముందని ప్రభుత్వాన్ని మందలించింది. ఇదే సమయంలో హైకోర్టు శీఘ్రగతిలో కేసును విచారణ చేస్తోందని స్పష్టం చేసింది. అధికార వికేంద్రికరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకున్న జగన్ తొందరపాటుతోనే న్యాయస్థానాల నుంచి ఎదురుదెబ్బలు తింటున్నారు. కానీ ఆయన తన తీరును మార్చుకోవడం లేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.











