కోర్టులు, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో కొందరు దూషణలు చేయడం, వ్యక్తుల నిర్భంధంపై హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కుట్రతో హైకోర్టుపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఏపీ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా ఎవరు కూడా న్యాయమూర్తులను దూషించరని…దీని వెనుక ఉన్న కుట్రను తేలుస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చితే చూస్తూ ఊరుకోబోమని కూడా ధర్మాసనం హెచ్చరించింది. న్యాయవ్యవస్థపై నమ్మకం లేనివారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరడం మంచిదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా అని ధర్మాసనం నిలదీసింది. చట్టబద్ద పాలన జరగకపోతే మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తామని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
న్యాయమూర్తులనే అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి దారితీస్తుందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని హెచ్చరించింది.
వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉందని హైకోర్టు గుర్తుచేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్టులను అనుమతించరాదని సామాజిక మాధ్యమాల సంస్థలను సూచించింది. వివిద అంశాలపై తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థలను కించపరిచేలా కొందరు అసభ్యకర పోస్టులు పెట్టడంపై తాము పిర్యాదు చేసినా సీఐడీ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పోస్టింగులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ నియంత్రణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్ లో అభ్యర్దించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ పోలీసుల తీరుపై మరోసారి విరుచుకుపడ్డ హైకోర్టు
ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని సాక్షాత్తూ డీజీపీని హైకోర్టుకు పిలిచి చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ధర్మాసనం హెచ్చరింది. అలాగే కొందరు పోలీసులపై కూడా తప్పుడు ఆరోపణలతో పిటిషన్లు వేయడం ఏమాత్రం సరికాదని కూడా విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందా?
హైకోర్టు ఈ స్థాయిలో ప్రభుత్వ చర్యలను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రభుత్వంలోని పెద్దలు కూడా న్యాయమూర్తుల మీద, న్యాయవ్యవస్థ మీద కించపరిచే ఆరోపణలు చేయడం జరిగింది. ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా మాట్లాడడం జరిగింది. వ్యవహారం నెమ్మదిగా ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు మధ్య వైరంలాగా తయారైంది. హైకోర్టు ఎలాంటి తీర్పులిచ్చినా.. ఆ తీర్పులను ప్రజలు అనుమానంగా చూసే వాతావరణాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సృష్టించింది. ఆ నేపథ్యంలో హైకోర్టు ఈ స్థాయిలో చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో చర్చను రేకెత్తిస్తున్నాయి.











