దేశంలో ప్రజా ప్రతినిధులపై నమోదవుతున్న కేసుల విచారణలు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. ఫలితంగా ఆయా కేసుల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఎంచక్కా చట్ట సభల్లో కొనసాగుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి వారైతే.. ఏకంగా సీఎం పదవిలోనూ కొనసాగుతున్నారు. మొత్తంగా ఆయా ప్రజాప్రతినిధులపై కేసులు నమోదవుతున్నా.. కేసుల విచారణలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారిస్తే.. తప్పు చేసిన ప్రజా ప్రతినిధులు జైలుకు వెళతారు. ఆ తర్వాత ప్రజా క్షేత్రంలో ఉన్నాం.. మనం తప్పు చేయొద్దు.. అన్న స్పృహ ప్రజా ప్రతినిధుల్లో కలుగుతుంది. మొత్తంగా ఈ తరహా కేసుల విచారణలో వేగం.. దేశానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పక తప్పదు.
ఇంకెన్నాళ్ల పాటు విచారణలు?
అయినా ఇప్పుడు ఈ అంశం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తోందంటే.. ప్రజా ప్రతినిధులపై నమోదవుతున్న కేసుల విచారణలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించాలని, ఆయా కేసులను త్వరితగతిన విచారణ పూర్తి చేసి తప్పు చేసిన ప్రజా ప్రతినిధులను శిక్షించాలని, తద్వారా దేశానికి మంచి చేయాలని, ఫలితంగా రాజకీయాల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ హన్సారియా.. సీజేఐ ధర్మాసనానికి తనదైన శైలి డిమాండ్లు వినిపించారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణల్లో వేగం లేదని, ఈ కేసుల విచారణ వేగవంతమయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు.
కాల వ్యవధి నిర్దేశించవచ్చు
పిటిషనర్ల వాదనలు సావదానంగా విన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఈ కేసు విషయంలో వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. వాస్తవానికి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారంపై జస్టిస్ ఎన్వీ రమణ చాలా కాలం నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. అంతేకాకుండా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్న కేసుల విచారణ సందర్భంగా మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకునేలా కక్షిదారులను ఒప్పిస్తున్నారు. ఈ దిశగా విడాకుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న రెండు జంటలను కూడా జస్టిస్ ఎన్వీ రమణ తిరిగి కలిపారు. మొత్తంగా కేసులు ఎలాంటివైనా వాటి విచారణల్లో జాప్యం జరగరాని విధంగా జస్టిస్ ఎన్వీ రమణ చర్యలు చేపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజా ప్రతినిధులపై కేసుల విషయంలో జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం వేగవంతమైన విచారణకే మొగ్గు చూపడం ఖాయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. న్యాయమూర్తి హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ ఈ విషయంపై ఓ కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడ అలాంటి తరహా పిటిషన్ విచారణ సందర్భంగా ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను నిర్ణీత కాల వ్యవధిలోనే ముగించాలని జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం తీర్పు చెప్పడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తీర్పు వచ్చాక.. జగన్ సహా కేసులు నమోదైన ప్రజా ప్రతినిధుల జాతకాలన్నీ మారిపోవడం ఖాయమేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
Must Read ;- జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాగ్రహంతోనైనా సీబీఐ మారాలి