వైఎస్సార్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం చిచ్చు కొనసాగుతూనే ఉంది. సరస్వతి పవర్ సంస్థలో వాటాల వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. తల్లి వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ కింద బదిలీ చేసిన షేర్లన్నీ తిరిగి తనకు దక్కేలా చూడాలంటూ..మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గతంలో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఐతే ఈ కేసు విచారణలో భాగంగా..విజయమ్మ తన వాదనలు వినిపిస్తూ కౌంటర్ వేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
వైఎస్ విజయమ్మ ట్రిబ్యునల్ ఎదుట న్యాయపరమైన,చట్టపరమైన అంశాలను నివేదించడమే కాదు..వాటితో పాటు ఆమె ఎమోషనల్ అంశాలను కూడా కోర్టు ఎదుట ఉంచుతున్నారు. ఇందులో ప్రధానంగా జగన్-భారతిలను బద్నాం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. సరస్వతి పవర్ సంస్థలో మొత్తం వాటాలు తనవి మాత్రమేనని.. ఇందులో మరెవ్వరికీ వాటాలు లేవని, వాటాల బదలాయింపు గురించి క్లెయిమ్ చేయడానికి కూడా ఎవరికీ అవకాశం లేదంటున్నారు విజయమ్మ.
సండూర్ పవర్, క్లాసిక్ రియాల్టీ సంస్థల వద్ద ఉన్న షేర్లను తాను పూర్తిగా కొనుగోలు చేసినట్టుగా..అలాగే జగన్, భారతీలు తమ వద్ద ఉన్న షేర్లను తనకు గిఫ్ట్ డీడ్ ద్వారా బదిలీ చేసినట్టుగా ఆమె చెబుతున్నారు. మొత్తం మీద సరస్వతి పవర్ లో ఇప్పుడు 99.75 శాతం షేర్లు కేవలం తనవి మాత్రమేనంటున్నారు విజయమ్మ. అదే సమయంలో ట్రిబ్యునల్ లో జగన్ ఏ కారణాలు చూపుతూ వాదనలు వినిపించారో..వాటిని విజయమ్మ తోసిపుచ్చుతున్నారు. షర్మిల భవిష్యత్తు కోసం తన పేరిట షేర్లు గిఫ్ట్ డీడ్ రాసినట్టుగా జగన్ చేస్తున్న వాదనల్లో నిజం లేదంటున్నారు.
జగన్- షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు ఉన్నమాట నిజమే కానీ..తనకు సరస్వతి పవర్ షేర్లు బదిలీ చేయడానికి, ఆ తగాదాలకు సంబంధం లేదనేది విజయమ్మ వాదన. దీంతో షర్మిలకు ముడిపెట్టి..తనకు ఇచ్చిన షేర్లను తిరిగి వెనక్కు అడగడానికి జగన్,భారతిలకు హక్కు లేదంటున్నారు. ఇవన్నీ చట్టపరంగా ఆమె చెబుతున్న అంశాలు కాగా..షర్మిల, జగన్ ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని, పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లి కోరుకోని విధంగా తాను కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఎమోషనల్ అస్త్రాన్ని సంధించారు విజయమ్మ. తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతి లకు సరికాదన్నారంటే విజయమ్మ టార్గెట్ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.











