BRS హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం – సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులకు నోటీసులు సైతం జారీ చేసి విచారించింది. ఇదే కేసులో ప్రముఖ సెఫాలజిస్టు ఆరా మస్తాన్‌కు సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. గతంలోనే నోటీసులు జారీ చేయగా ఆయన సిట్ ముందుకు రాలేదు. తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్…విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.
……………..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరా మస్తాన్ వినియోగించిన రెండు మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులు ట్యాప్ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ అంశంపై ఆయన నుంచి వివరాలు సేకరించేందుకు గతంలోనే నోటీసులు పంపారు సిట్ అధికారులు. కానీ ఆరా మస్తాన్ మాత్రం సిట్ ఎదుట హాజరయ్యేందుకు వెనుకాడుతున్నారు. పనులు ఉన్నాయని చెబుతూ విచారణకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్నారు. ఇలా రెండు, మూడు సార్లు జరిగింది.
……………..
ఆరా మస్తాన్..సర్వేలు చేస్తానని రాజకీయనేతలలో కాస్త పలుకుబడి సంపాదించుకున్నారు. ఐతే ఆయనను కూడా ట్యాపింగ్‌లో టార్గెట్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ ట్యాపింగ్‌లో ఆయన సీక్రెట్స్ గుర్తించి బ్లాక్‌మెయిల్ చేసి అనుకూలంగా సర్వేలు రాయించుకున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. గత ఎన్నికల్లో ఆరా మస్తాన్ సర్వేలు సక్సెస్ కాలేదు. పలు ఉపఎన్నికలతో పాటు..తెలంగాణ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కొన్ని పార్టీలకు అనుకూల సర్వేలు ప్రకటించారు. చివరకి తన సర్వేల క్రెడిబిలిటీని దెబ్బతీసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ అయిందన్న నిజాన్ని కూడా ఒప్పుకునేందుకు ఆయన భయపడుతున్నారు.
………………
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఫైనల్ స్టేజ్‌కు చేరినట్లు తెలుస్తోంది. ఈ దశలో ఆరా మస్తాన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడం అత్యవసరం అని భావించిన సిట్ అధికారులు, ఆయనకు రెండోసారి నోటీసులు పంపారు. ఈసారి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. దీంతో ఇవాళ సిట్ అధికారుల ఎదుట ఆరా మస్తాన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తులో మరింత కీలకం కానున్నాయని భావిస్తున్నారు.











