ఇద్దరు ప్రతిభావంతమైన నటులు దొరికితే.. ఏ దర్శకుడికైనా తన టాలెంట్ ను నిరూపించుకొనే అరుదైన అవకాశం దక్కినట్టే. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మలయాళ సినిమా విషయంలో దర్శకుడు సచ్చికి అలాంటి బంగారం లాంటి అవకాశం దక్కింది. అందుకే ఈ సినిమా భాషలకతీతంగా జనాదరణ పొందింది. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మలయాళ పరిశ్రమకే ఒక మాస్టర్ పీస్ లాంటిది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ హక్కులు కొనుగోలు చేసింది.
కథేంటి? : కోషి కురియన్ ఒక రోజు రాత్రి కార్ లో తన సొంతూరుకు వెళుతూ ఉంటాడు. కారు డ్రైవర్ కిచ్చి.. తను వెనుక సీట్లో నిద్రపోతాడు. ఆ కార్ ఒక పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర ఆగుతుంది. పోలీసుల చెకింగ్ లో కార్ లో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి. తాను రిటైర్డ్ హవల్దార్ నని, తనకు అవి కోటాలో వచ్చాయని చెబుతాడు. అయినా సరే ఆ ఏరియాలో మధ్య నిషేధం ఉండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. కోషి వారిమీద తిరగబడతాడు. ఇంతలో పోలీస్ అధికారి అయ్యప్పన్ నాయర్ కోషిమీద చెయ్యి చేసుకొని.. అతడ్ని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తీసుకెళతాడు. కోషి అవమానంగా ఫీలవుతాడు.
అతడి ఫోన్ లాక్కుని , అతడి కార్ ను సీజ్ చేసి అతడి మీద కేస్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఒక కానిస్టేబుల్ అతడి ఫోన్ ను చెక్ చేయగా.. కోషి పెద్ద వారితో పరిచయం ఉన్న ఒక ప్రముఖ వ్యక్తి అని అర్ధమవుతుంది. అయ్యప్పన్ నాయర్ .. అతడ్ని మర్యాద పూర్వకంగా ట్రీట్ చేసి.. అతడి మీద కేస్ ఫైల్ చేసి అతడ్ని కోర్ట్ కు సబ్ మిట్ చేసే తీరతానని చెబుతాడు. దాంతో కోషి.. అయ్యప్పన్ సస్పెండ్ అయ్యే రీతిలో అతడ్ని ఓ కేస్ లో ఇరికిస్తాడు. అక్కడి నుంచి అయ్యప్పన్ కి, కోషికి మధ్య వైరం మొదలవుతుంది. ఇద్దరిలోనూ ఇగో ప్రధాన సమస్యగా మారుతుంది. చివరికి అయ్యప్పన్ నాయర్ , కోషి శత్రుత్వాన్ని విడిచిపెట్టి స్నేహితులుగా ఎలా మారారు అన్నదే మిగతా కథ.
ఎలా తీశారు? : పృధ్విరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ ఇద్దరికిద్దరు మలయాళ చిత్ర సీమలో ప్రతిభావంతమైన నటులు. అలాంటి హీరోలమీద ఏ దర్శకుడైనా..అభిమానుల్ని ఆకట్టుకోవడానికి ఒక మాస్ యాక్షన్ సినిమా ప్లాన్ చేయొచ్చు. కానీ దర్శకుడు సచ్చీ మాత్రం అలా ఆలోచించలేదు. ఆ ఇద్దరూ నువ్వా నేనా అని నటించేలా ఒక థ్రిల్లింగ్ స్టోరీ రాసుకున్నాడు. ఆ క్రమంలో ఇద్దరి పెర్పార్మెన్స్ పీక్స్ లో ఉండే సీన్స్ ను డిజైన్ చేసుకున్నాడు. అంతేకాదు కథలో మరికొన్ని సబ్ ప్లాట్స్ ను ఇన్ సెర్ట్ చేసి .. యాక్షన్ మూవీని తలదన్నే రీతిలో తీర్చిదిద్దాడు. దాంతో సినిమా ఎక్కడా బోర్ కొట్టించదు. సెకండాఫ్ మీద ఆసక్తి కలిగే రీతిలో ఫస్టాఫ్ ను, రాబోయే సీన్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల్లో కలగజేశాడు. అందుకే ఈ సినిమా మాలీవుడ్ లో టాప్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచిపోయింది. దర్శకుడు సచ్చి ఈ సినిమా విడుదలయ్యాక చనిపోవడం విచారకరం.
హైలైట్స్ : సినిమా స్టార్టింగ్ లో ఒక గిరిజనుడు.. ఒక వ్యక్తిని తనకున్న ఒక కిల్లింగ్ టెక్నిక్ తో చంపేస్తాడు. అతడే అయ్యప్పన్ నాయర్ అని ఆ తర్వాత తెలుస్తుంది. అతడు ఎవరినైనా.. వెనకాల నుంచి ఛాతీ ని రెండు చేతుల్నీ గట్టిగా బిగించి పట్టుకున్నాడంటే.. అవతలి వ్యక్తి ఎంతటి బలశాలి అయినా.. ప్రాణం వదిలేయాల్సిందే. అయ్యప్పన్ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకూ పర్వాలేదు. దాన్ని తీసేస్తేనే ప్రమాదం. అలాంటి మనిషికి యూనిపామ్ లేకుండా చేస్తాడు కోషి.
ఈ సినిమాలో రెండు సందర్భాల్లో కోషిని . అయ్యప్పన్ నాయర్ .. ఆ విధంగానే .. అతడి ఛాతీ మీద పట్టు బిగిస్తాడు. ఆ సమయంలో ఏం చేయలేని నిస్సహాయుడైపోతాడు కోషి. అయినా సరే.. అతడి ఎదుర్కోవడానికి కోషి సిద్దపడతాడు. ఈ రెండు సీన్స్ సినిమాకి హైలైట్స్ గా నిలిచిపోతాయి. కోషిగా పృధ్విరాజ్ సుకుమారన్, అయ్యప్పన్ నాయర్ గా బిజూ మీనన్, అతడి భార్య గా గౌరీ నందా, అయ్యప్పన్ సుపీరియర్ ఆఫీసర్ గా అనిల్ నెడుమాంగాడ్, పృధ్విరాజ్ తండ్రిగా ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ అద్భుతంగా నటించారు.
నటీనటులు : పృధ్విరాజ్ సుకుమారన్, బిజూ మీనన్, అనిల్ నెడుమాంగాడ్, రంజిత్, గౌరీ నందా, అన్నారాజన్, సాబూ మోన్ అబ్దుసమద్ తదితరులు
నిర్మాణం : రంజిత్, పి.యమ్.శశిధరన్
దర్శకత్వం : సచ్చి
ఒక్కమాటలో : ఎక్సైటింగ్ యాక్షన్ థ్రిల్లర్
ఎక్కడ చూడాలి?: అమెజాన్ ప్రైమ్ విత్ తెలుగు సబ్ టైటిల్స్ .
భాష : మలయాళం
రేటింగ్ : 4 /5
-ఆర్కే











