మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. తన అభ్యర్థులతో పాటుగా తనతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన బీజేపీ, జనసేన అభ్యర్థులను కూడా గెలిపించకోవడంలో టీడీపీ సత్తా చాటిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో టీడీపీ కొట్టిన దెబ్బకు వైైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగానే దిమ్మ తిరిగిందని చెప్పక తప్పదు. తనకు మంచి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో టీడీపీ సాధించిన విజయాన్ని పరిశీలిస్తే… జగన్ పై ఏ మేర వ్యతిరేకత ఉందన్న విషయం ఇట్టే అర్థం కాకమానదు.
అలా జగన్ పై జనాల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను టీడీపీ మరింతగా బయటకు తీసుకవస్తోంది. అందులో భాగంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఆయనపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు బట్టబయలైంది. ప్రస్తుత సాగునీటి సంఘాల ఎన్నికల్లో పులివెందులలో ఏ ఒక్క చోట కూడా వైసీపీ విజయం సాధించలేదు. కనీసం పోటీ చేసే సాహసం కూడా ఆ పార్టీ శ్రేణులు చేయలేకపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పులివెందుల పరిధిలోని ప్రతి పల్లెలో జగన్ కు పట్టు ఉందనే చెప్పాలి. ఎందుకంటే… ఏళ్ల తరబడి వైఎస్ ఫ్యామిలీ అక్కడ తిష్ట వేసింది. జగన్ కంటే ముందు ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. రాజశేఖరరెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆయన సోదరుడ వివేకానందరెడ్డి ఎ్మెమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ గెలుస్తూ వస్తున్నారు. మొత్తంగా ఇక్కడ టీడీపీకి ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవన్న వాదనలు ఉన్నాయి. అయితే టీడీపీ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడి మాదిరిగా పులివెందులపై ప్రతిసారీ పూర్తి ఎఫర్ట్ పెడుతూనే ఉంది.
గతంలో సతీశ్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీపై పోటీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యతను యువ నేత బీటెక్ రవి తన భుజస్కందాలకు ఎత్తుకున్నారు. తాజాగా ఆయనకు మంత్రి భూమిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి తోడయ్యారు. ఇంకేముంది… పులివెందులలోని ప్రతి పల్లెలో టీడీపీ జెండా పాతుకుంటూ పోతున్నారు. తాజాగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో వారిద్దరి కృషి ఫలించింది. నియోజకవర్గంలోని అన్ని సంఘాలనూ టీడీపీ వశం చేసిన వారిద్దరూ.. జగన్ కు డేంజర్ బెల్స్ ను వినిపించారు.
వాస్తవానికి పులివెందులపై జగన్ ప్రత్యేకించి దృష్టి సారించిన దాఖలాలు లేవు. కడప ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు అవినాశ్ రెడ్డి, ఇతరత్రా ఆయన బంధువర్గమే పులివెందుల రాజకీయాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. అయితే తాజా సాగునీటి సంఘాల ఎన్నికల్లో పార్టీకి ఘోర పరాభవం తప్పదన్న సంకేతాలను ముందుగానే గుర్తించిన అవినాశ్ రెడ్డి ఎన్నికల్లో ఎలాగోలా నెగ్గుకు రావాలని యత్నించారు. ఈ క్రమంలోనే ఆయన శుక్రవారం వేముల మండలంలో నానా యాగీ చేశారు.
ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు కూడా అవినాశ్ రెడ్డిని గృహ నిర్బంధంలోకి నెట్టేశారు. వెరసి ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాల లేకుండా అడ్డుకోగలిగారు. ఫలితంగా అప్పటిదాకా టీడీపీ అంటే… ముందుకువచ్చేందుకే జంకిన జనం తాజాగా ఉత్సాహంగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. టీడీపీకి బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. జనంలోని భయాన్ని బీటెక్ రవి, భూమిరెడ్డి రాంప్రసాద్ రెడ్డిలు పారదోలితే… జనం తమలోని జగన్ వ్యతిరేకతను బయటపెట్టేశారు. ఫలితంగా జగన్ కు కంచకోటగా పేరున్న పులివెందులలో వైసీపీకి ఘోర పరాభవం తప్పలేదు.