జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో.. జంట నగరాల్లో పార్టీని మరింతగా పటిష్టం చేయడానికి పాదయాత్ర నిర్వహించడానికి రాష్ట్ర బీజేపీ సారథి బండి సంజయ్ పూనుకుంటున్నారు. ఆదివారం నాడు పార్టీ కీలక నాయకులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. బండిసంజయ్ ప్రతిపాదించిన ఈ ఆలోచనకు పార్టీలో పలువురు పెద్దలనుంచి సానుకూల వైఖరి వ్యక్తమైంది. పాదయాత్ర అనేది ఖచ్చితంగా పార్టీకి లాభిస్తుందనే ఉద్దేశంతోనే వారున్నారు. రూట్ మ్యాప్ ఎలా ఉండాలనే విషయంలోనే మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
బీజేపీ కార్యాలయంలో ఆదివారం నాయకుల కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధర్ రావు తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు. కొత్త వరాలు కురిపిస్తూ, ఎంఐఎంతో అధికారికంగానే పొత్తు పెట్టుకుంటూ గులాబీ దళాలు చేస్తున్న వ్యూహరచనను సమర్థంగా ఎదుర్కొంటూ.. దుబ్బాకలో సాధ్యమైన మ్యాజిక్ ను జంటనగరాల్లో ఎలా రిపీట్ చేయాలనే విషయంలో నాయకులు మేధోమధనం సాగించారు.
గ్రేటర్ ఎన్నికలకు సంసిద్ధం కావడంలో భాగంగా..బండి సంజయ్ వివిధ కమిటీలను నియమించారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్‌గా లక్ష్మణ్, జూయింట్ కన్వీనర్లుగా మాజీ ఎంపీలు వివేక్, గరికపాటి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఛైర్మన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించనున్నారు. గ్రేటర్ ఎన్నికలకు జాతీయ కమిటీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యడు భూపేందర్ యాదవ్, ఉపాధ్యక్షుడిగా అఖిలేష్ షెల్లర్, సభ్యుడిగా గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింగ్, కర్ణాటకకు చెందిన సతీష్ రెడ్డి లను నియమించారు.
Also Read ;- గులాబీ బాస్ గ్రేటర్ ప్లాన్.. కమలనాథులకు చెక్
బల్దియా ఎన్నికలను ఎప్పుడు నిర్వహించినా సమర్థంగా ఎదుర్కొంటాం అని చెబుతున్న పార్టీ నాయకుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ కార్పొరేటర్ల అవినీతిని ఎండగట్టడమే లక్ష్యంగా ప్రచారం ఉంటుందంటున్నారు. టీఆర్ఎస్ కొత్తగా ప్రకటించిన తాయిలాలు ఏవీ పనిచేయవని, పాలకవర్గం పదవీ కాలం ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఉన్నప్పటికీ … ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఎన్నికల ప్రభావంతో గ్రేటర్ ఎన్నికలు లేటు అయితే బీజేపీ ఇంకా బలపడే అవకాశం ఉందని కేసీఆర్ కుట్ర పూరితంగా ముందుగానే ఎన్నికలకు వెళ్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. ఓవైసీ, కేసీఆర్ అర్ధరాత్రి కుట్రలను ప్రజలకు వివరిస్తామంటున్నారు.
ఈ సమావేశంలో ఒక ప్రతిపాదనగా.. బండి సంజయ్ నగరంలో పాదయాత్ర చేయాలనే ప్రతిపాదన వచ్చింది. సోమవారం నాడే పాదయాత్రలు మొదలయ్యే అవకాశం కూడా ఉంది.
ఇది దగ్గరి దారా?
ప్రజలను బాగా ఆకట్టుకోవడానికి దగ్గరిదారిగా పాదయాత్ర ఒక టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ సిద్ధాంతంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉంది. గతంలో వైఎస్ఆర్ పాదయాత్రచేసి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత.. చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు. అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డికి కూడా.. అదే ఫలితం దక్కింది. ఇప్పుడు జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవడానికి బండి సంజయ్ కూడా అదే వ్యూహాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మరి వారికి ఎలాంటి ఫలితం దక్కుతుందో వేచిచూడాలి.
Also Read ;- దుబ్బాక దెబ్బతో పన్నులో రాయితీ.. మరీ జీహెచ్ఎంసీలో దెబ్బకొడితే?