పాత హ్యాండ్ బ్యాగే కదా పనికి రాదులే అని చెత్త వాహనంలో ఆ బ్యాగును పడేసింది ఓ మహిళ. అందులో విలువైన వస్తువులలతో పవిత్రంగా భావించే మంగళసూత్రం కూడా ఉందని తరువాత తెలిసింది. యంత్రాంగం, సామాజిక కార్యకర్త, ఆ కుటుంబం కలసి 18 టన్నుల చెత్తలో ఆ చిన్న హ్యాండ్ బ్యాగ్ ను వెతికి పట్టుకున్నారు.. రూ.3లక్షల విలువైన ఆభరణాలూ తిరిగి వచ్చాయి. అదే ఆ ఇంటికి దీపావళి.. ఈ ఘటన పూణెలో జరిగింది.
పండుగకోసం ఇంటికి శుభ్రం చేసే పనుల్లో భాగంగా ఓ మహిళ ఏమరపాటున రూ.3లక్షల విలువైన ఆభరణాలు ఉన్న హ్యాండ్ బ్యాగ్ చెత్త వాహనంలో వేసేసింది. తరువాత రియలైజ్ అయ్యింది. సామాజిక కార్యకర్త, అధికార యంత్రాంగం సహకారంతో మళ్లీ ఆ నగలు తిరిగి పొందింది.
మహారాష్ట్రలోని పూణె నగరంలో సౌదాగర్ ఏరియాలో లేఖ సేల్కర్ అనే మహిళ పండుగ కోసం తన ఇంటిని శుభ్రం చేసింది. అనంతరం గార్బేజ్ వాహనానికి (గంటా గాఢీ) ఆ చెత్తను ఇచ్చేసింది. అందులో ఓ చిన్న హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది. పాత హ్యాండ్ బ్యాగే కదా..ఇంకా అవసరం లేదనుకుని పడేసిన విషయం రెండు గంటల తరువాత గుర్తొచ్చింది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఏం ఉన్నాయనే విషయం కూడా గుర్తొచ్చి షాక్ తింది. దాదాపు రూ.3లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న పాత హ్యాండ్ బ్యాగ్ అది. ఆ హ్యాండ్ బ్యాగ్ లో మంగళసూత్రం, యాంక్లెట్ తోపాటు ఇతర నగలూ ఉన్నాయి. దీంతో ఆమె చాలా కంగారుపడింది. వెంటనే స్థానికంగా ఉంటే సామాజిక కార్యకర్త సంజయ్ కుటే కు సమాచారం ఇచ్చింది. తన హ్యాండ్ బ్యాగ్ లో ఎంత విలువైన వస్తువులు కూడా కూడా వెల్లడించింది.
దీంతో ఆయన స్థానిక పూణె నగరపాలక సంస్థ, వైద్య విభాగం అధికారులతో మాట్లాడి విషయం చెప్పారు. అప్పటికే సెల్కర్ కుటుంబం సదరు చెత్త సేకరణ వాహనం ఎక్కడుందో వెతుకుతున్నారు. సంజయ్ ఇచ్చిన సమాచారంతో ఆ ఏరియా శానిటరీ ఇన్ స్పెక్టర్ సుశీల్ మలాయెతో పాటు వాహనాల డేటా అనలిస్ట్ విభాగ ఉద్యోగి హేమంత్ లఖన్ తో కలసి వాహనం ఎక్కడ ఉందో లొకేట్ చేశారు. అప్పటికి సదరు వాహనం చెత్తను డంప్ చేయలేదు. దీంతో దాదాపు 40 నిమిషాలపాటు 18 టన్నుల చెత్తలో లఖన్ తోపాటు మరికొందరు ఆ సంచికోసం వెతికి సాధించారు. ఆ హ్యాండ్ బ్యాగ్ లోని ఆభరణాలూ అందులోనే ఉన్నాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ సదరు వాహనం డంపింగ్ యార్డులో చెత్తను డంప్ చేసి ఉంటే ఆ సంచిని కనిపెట్టడం అసాధ్యమని లఖన్ మీడియాతో వ్యాఖ్యానించాడు. ఆ సంచి లభించడంతో సేల్కర్ ఫ్యామిలీ టెన్షన్ నుంచి బయటపడింది. లఖన్ తో పాటు తమకు సహకరించిన యంత్రాంగానికి, సామాజిక కార్యకర్త సంజయ్ కి దన్యవాదాలు తెలిపింది. సేల్కర్ కుటుంబానికి మాత్రం ఈ దీపావళి ప్రత్యేకంగా గడిచింది.
Also Read ;- ‘అంబానీ స్థాయి సంపన్నుడిగా కెసిఆర్’










