దుబ్బాక ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల గురించి ఇప్పటికి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారంటే దుబ్బాక ఎన్నిక ఫలితం రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్ధం చేసుకోవచ్చు.
దుబ్బాక విజయం కాషాయ పార్టీలో మంచి బూస్టును నింపితే.. గులాబీ పార్టీ నాయకుల్లో మాత్రం ఒకింత నైరాశ్యంను నింపిందనే చెప్పకతప్పదు. దీన్నుంచి బయటపడేందుకు ఫలితంగా దీపావళి కానుక పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసిందనే వాదనను బీజేపీ, విపక్ష నేతలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ మాత్రం త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం ప్రకటించిన ఈ దీపావళి కానుకను తమకు అనుకూలంగా మార్చుకుంటూ తెగ వాడేసుకుంటుంది. ‘దుబ్బాక దెబ్బకు ఇంటి పన్నులో రాయితీ.. జీహెచ్ఎంసీలో దెబ్బ కొడితే ఎల్ఆర్ఎస్ పోతుంది. ఓటు వేసేముందు ఆలోచించండి ’ అంటూ సోషల్ మీడియాలో బీజేపీ పేరుతో పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి.
దుబ్బాక స్థానానికి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులపై ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. అలాగే దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ప్రజలను ఆలోజింపచేశాయి. కరోనా సమయంలో చేయడానికి పని దొరక్కా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న జనం నెత్తిన ఎల్ఆర్ఎస్ స్కీం భారం పడింది. ఈ అంశాలపై విమర్శలు చేస్తూ ఎన్నికలో బీజేపీ ముందుకు సాగింది. మరోవైపు ఇతర విపక్షాల గగ్గోలు. వెరసి దుబ్బాక ఫలితం తారుమారైంది. సిఎం, మంత్రి హరీష్‌రావు ఇలాఖాలో బీజేపీ తమ జెండాను ఎగురవేసింది. తమకు గెలుపు తప్ప ఓటమే లేదనుకున్న టీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా డిఫెన్స్‌లోకి పడినట్లయింది. అసలే ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దుబ్బాక ఓటమి ఆ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడుతుందో అనే మీమాంసలో పడినట్లు విపక్షాలు పేర్కొంటున్నాయి. ఈనేపథ్యంలోనే జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకే దిపావళి కానుక పేరుతో ప్రభుత్వం ఈవిధంగా ప్రకటన చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15వేల లోపు ఇంటి పన్ను కట్టినవారికి, ఇతర జిల్లాల్లో రూ.10వేలు కట్టిన వారికి 50శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. అలాగే వరద సాయం కింద రూ.10వేలు అందని బాధితులు ఎవరైనా ఉంటే మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని దీపావళి కానుక పేరుతో మంత్రి కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒక్క దుబ్బాకలో ఓడిపోతెనే ఈ విధంగా ప్రభుత్వం ప్రకటన చేసింది. ఇక జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తే ఎల్ఆర్ఎస్ తదితర ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కు తీసుకుంటుందనే ప్రచారాన్ని బీజేపీ చేస్తోంది.
AlaoRad ;- దుబ్బాక ఎన్నికల్లో గెలిచినా సరే.. హైకోర్టుకు వెళ్లిన రఘునందన్!