ఏం మాట్లాడుతున్నారు మీరు? దుబ్బాక ఫలితాన్ని చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడతారా? మాకు అర్థమైంది.. మీరు పక్కా టీఆర్ఎస్ అని.. లాంటి వ్యాఖ్యలు కొందరి మనసుల్లో ఉండొచ్చు. కానీ అవేమీ నిజాలు కావు. పాలిటిక్స్ లో ఉండే బ్యూటీ ఏమిటంటే.. ప్రజల నాడిని సరిగ్గా పట్టుకోగలిగితే.. ఫలితాన్ని ముందే చెప్పేయొచ్చు. 2018లో ఎన్నికల్ని ముందే నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ కావటానికి దాదాపు ఆర్నెల్ల ముందు నుంచి భారీ కసరత్తు చేపట్టారు.
మిగిలిన పార్టీలు ఎన్నికలకు చాలా టైం ఉందన్న ఆలోచనలో ఉన్నప్పుడే కేసీఆర్ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న వివరాల్ని గ్రౌండ్ నుంచి తెప్పించారు. జాగ్రత్తగా స్టడీ చేశారు. తనకున్నఅవకాశాల్ని బేరీజు వేసుకున్నారు. అలా రంగంలోకి దిగిన ఆయన.. కాంగ్రెస్-టీడీపీ పొత్తు విషయంలో తొట్రుపాటుకు గురైనా.. తన అమ్ములపొదిలో ఉన్న భావోద్వేగ అస్త్రాన్ని బయటకు తీశారు. తర్వాత ఫలితం ఏమైందన్నది తెలిసిందే.
ఇదంతా ఎందుకంటే, రాజకీయాల్ని వాస్తవిక కోణంలో చూస్తే.. ఏం జరగనుందన్న విషయాన్ని ముందే అంచనా వేయొచ్చని చెప్పటమే. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాక ముందే చెబుతున్నాం. గ్రేటర్ పీఠం గులాబీదే. అలా ఎలా చెప్పగలరు? అంత నమ్మకం ఏమిటంటారా? గ్రేటర్‌లో ఎన్నికలు జరిగితే ఎవరేం చేయాలన్న విషయాన్ని దాదాపు ఆర్నెల్ల క్రితమే డిసైడ్ చేసిన ఘనత కేసీఆర్‌దే.
ఇప్పుడు పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా.. ఆయనకు అండగా నిలవటానికి మజ్లిస్ ఉందన్నది మర్చి పోకూడదు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో మేజిక్ ఫిగర్ 76 డివిజన్లు. ఇందులో అందరూ ఒప్పుకునే వాస్తవం 40 స్థానాలు మజ్లిస్ ఖాతాలోకి వెళ్లేవే. వాస్తవానికి ఒకట్రెండు ఎక్కువగా ఉన్నప్పటికి నలభై స్థానాలకు తగ్గదు. కాదంటే..మరో ఐదు తగ్గిద్దాం. అంటే.. 35 డివిజన్లు.
గ్రేటర్‌లో బలమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
గ్రేటర్‌లో పాగా వేయటానికి అవసరమైన 76 డివిజన్లలో 35 డివిజన్లను తీస్తేస్తే మిగిలేవి 41 డివిజన్లు. మజ్లిస్ పోటీ చేయగా.. మిగిలిన 110 స్థానాల్లో 41 స్థానాల్ని టీఆర్ఎస్ గెలుచుకోవటం చాలా తేలిక. అదెలానంటే.. గ్రేటర్‌లో బలమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మంత్రిగా వ్యవహరిస్తున్న తలసాని(సనత్ నగర్) .. పద్మారావు(సికింద్రాబాద్).. ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్).. గాంధీ (శేరిలింగంపల్లి).. మాధవరావు (కుకట్‌పల్లి).. మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్).. దానం నాగేందర్ (ఖైరతాబాద్).. సుధీర్ రెడ్డి (ఎల్ బీ నగర్).. మైనంపల్లి హనుమంతరావు (మల్కాజ్‌గిరి) ఉన్నారు. మిగిలిన వారు బలమైన వారు కాదని కాదు, కానీ వారికంటూ కొన్ని పరిమితులు ఉన్నాయి.
వేళ్ల మీద లెక్కిస్తే నియోజకవర్గాల్లో తమకంటూ బలమైన ఈ నేతలు తొమ్మిది మంది ఉన్నారు. ఒక్కొక్కరు నాలుగు డివిజన్లు గెలవటం నల్లేరు మీద నడక. అలా చూసుకుంటే వచ్చేవి 36. మిగిలిన ఆరు అన్నది అసలు విషయమే కాదు. హీనపక్షం లెక్క వేస్తే వచ్చే సీట్లు. నిజానికి ఇంతకంటే మెరుగైన సీట్లు ఖాయంగా వస్తాయి. ఎందుకంటే.. టీఆర్ఎస్ కార్పొరేటర్లకున్న బలం అలాంటిది. పరిస్థితులన్ని దారుణంగా.. వాతావరణం పూర్తిగా వ్యతిరేకంగా మారిన సందర్భంలో ఈ లెక్కలోకి వెళ్లినా.. గ్రేటర్ పీఠం గులాబీదే. ఇక.. మామూలు పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే.. తమకు అవసరమైన బలాన్ని తాము సొంతంగా సాధించటం ఖాయం. ఇప్పుడు చెప్పండి.. గ్రేటర్ పీఠం గులాబీదే అంటే ఒప్పుకుంటారా?