ఏపీలో 18 లక్షల రైతులకు 16 సంవత్సరాలుగా ఉచిత విద్యుత్ అందుతోంది. ప్రభుత్వం 9 గంటలు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇందుకు ర్యాండమ్ గా రీడింగ్ తీసి విద్యుత్ పంపిణీ సంస్థలకు ఏటా 8000 కోట్లు చెల్లిస్తోంది. తాజాగా ప్రతి మోటారుకు మీటరు బిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్రం కొత్తగా విద్యుత్ రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు రుణ రూపంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ ను అనేక రాష్ట్రాలు తిరస్కరించాయి. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు పెట్టేందుకు తెలంగాణ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రకటించిందే తడవుగా మీటింగ్ వేసుకుని డిసెంబర్ నాటికి మీటర్లు బిగించాలని నిర్ణయించింది. ముందుగా తక్కువ మోటార్లు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎందుకంత తొందర
రాష్ట్రంలో 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.2000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంత ఖర్చు చేస్తే ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చే రుణం రూ.4000 కోట్ల మాత్రమే. అంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.4000 కోట్ల అప్పుకోసం రూ.2000 కోట్ల ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదన్న మాట.
ఎంత పెద్ద రుణాలు చేసినా, నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా.. కేవలం సంక్షేమ పథకాల రూపేణా ప్రజలకు పంచిపెట్టడానికే సరిపోతోంది. అప్పులు తేవడం, ప్రజలకు పంచడం అనే వ్యవహారం మాత్రమే నడుస్తోంటే.. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో అనే భయం ప్రజల్లో కూడా ఉంది. వచ్చే నెల జీతాలకు కూడా ఇబ్బందిగా ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం కేంద్రంలోని పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళుతున్నారు. వచ్చే నెల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఫించన్లు వచ్చే సజావుగా చెల్లించాలన్నా.. కేంద్రం సాయం అందిస్తే తప్ప సాధ్యం కాదనే అభిప్రాయం పలువురిలో ఉంది.
మీటర్లు వృథా ప్రయాస.. ఎందుకంటే?
ఏపీలో 18 లక్షల పంపుసెట్లకు మీటర్లు బిగించడం వృధా ప్రయాసే అవుతుంది. ఎందుకంటే చాలా మంది రైతులు సబ్ మెర్సిబుల్ మోటార్లే వినియోగిస్తున్నారు. అవన్నీ భూమిలో 100 నుంచి 200 అడుగుల లోతులో ఉంటాయి. ఇక మోటారు వద్ద ఆపరేషన్ కోసం ఒక కట్టెకు బాక్సు పెట్టుకుంటారు. ఇక అక్కడ మీటర్లు బిగించడం అంటే సాహసమే. వర్షం వస్తే తడసి పోవాల్సిందే. విద్యుత్ మీటర్లు తడిస్తే ఆరు నెలలు కూడా పనిచేయవు. ఇవన్నీ తెలిసినా ప్రభుత్వం మాత్రం మీటర్లు బిగించి రూ.4000 కోట్లు అప్పుతీసుకోవాలని చూస్తేంది. మీటర్లు బిగించడం ద్వారా రూ.2000 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందనే ఆలోచన మాత్రం చేయడం లేదు.
ఇంత వరకూ ఏ రాష్ట్రంలో మీటర్లు బిగించలేదు
దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులు మోటార్లు వాడుతున్నారు. కొన్ని రాష్ట్రాలు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మరొకొన్ని రాష్ట్రాలు పంపు సెట్ల హార్స్ పవర్ ను బట్టి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నాయి. మీటర్లు మాత్రం ఎక్కడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అయినా ఏపీ ప్రభుత్వం దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరి నాటికే 18 లక్షల పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేసేలా ఉన్నారు.
తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ
పంపుసెట్లకు మీటర్లు పెడితే తెలంగాణకు రూ.2000 కోట్ల రుణం ఇస్తామని కేంద్రం చెప్పిన వెంటనే కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. మీటర్లు బిగించడం వల్ల రైతుల్లో తీవ్ర వ్యతిరేకతతో పాటు అవి ఎంతో కాలం పనిచేయవని కేసీఆర్ గ్రహించారు. అందులో తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ను విజయవంతంగా అందిస్తున్నారు. అలాంటి సమయంలో ఇక మీటర్లు పెట్టి ప్రయోజనం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలివైన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఎలాంటి చర్చ లేకుండానే హడావుడి నిర్ణయం తీసుకున్నారని రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.











