నర్తనశాల.. ఇప్పుడీ పేరు అంతర్జాలంగా ట్రెండింగ్. అసలు ‘నర్తనశాల’ అనే పేరులోనే ఓ వైబ్రేషన్. మహానటుడు నందమూరి తారక రామారావు చిత్రాల్లో ఇదో ఆణిముత్యం. ఈ సినిమాని మళ్లీ తెరకెక్కించాలన్నది హీరో బాలకృష్ణ కల. పైగా దీనికి తనే దర్శకత్వం వహించాలనుకున్నారు.
2002లో ఆయన మదిలో మొదలైన ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి మరో రెండేళ్లు పట్టింది. మొత్తానికి ప్రాజెక్టు పట్టాలెక్కింది. 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో నాలుగు పాత్రలు పోషించాలని బాలకృష్ణ అనుకున్నారు. అర్జునుడు, బృహన్నల, కీచకుడు, శ్రీకృష్ణుడు పాత్రను బాలకృష్ణ పోషించాలనుకున్నారు. కాకపోతే ఈ నెల 24వ తేదీ ప్రసారమయ్యే ఈ చిన్న చిత్రంలో బాలకృష్ణ ఎన్ని పాత్రల్లో కనిపిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ద్రౌపదిగా సౌందర్య, ధర్మరాజుగా శరత్ బాబు, భీముడిగా శ్రీహరి, నకుల సహదేవులుగా నవీన్, వినయ్ నటించారు. అంతా సాఫీగా జరిగిపోతుందనుకుంటున్న తరుణంలో నటి సౌందర్య విమాన ప్రమాదం కన్నుమూశారు. ఈ ప్రమాదం 2004 ఏప్రిల్ 17న జరిగింది. దౌపదిగా సౌందర్య తప్ప మరో నటిని బాలకృష్ణ ఊహించుకోలేకపోయారు. అక్కడితో సినిమా షూటింగ్ ముగిసిపోయింది.
ఆ తర్వాత ఇందులో భీముడి పాత్ర పోషించిన శ్రీహరి 2013 అక్టోబరు 9 కన్నుమూశారు. ఈ ఇద్దరూ ఇప్పుడు భౌతికంగా మనముందు లేకపోయినా ద్రౌపదిగా సౌందర్యనూ, భీముడిగా శ్రీహరినీ ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ విశేషాలతోపాటు మరికొన్ని విశేషాలు కూడా 24వ తేదీ విడుదలయ్యే సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిసింది. అవే పాత నర్తనశాలలోని నందమూరి తారకరామారావుకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు. వీటిని కూడా బాలకృష్ణ జోడించినట్లు తెలుస్తోంది. 17 నిమిషాల సినిమానే అయినా ఓ ప్రధాన సినిమాకు రావలసినంత హైప్ వచ్చింది. టికెట్ ధర రూ. 50 నిర్ణయించినా ఆ డబ్బును బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికీ, వరద బాధితుల సహాయం కోసం వినియోగిస్తామని కూడా బాలయ్యబాబు చెబుతున్నారు.
ఈ ‘నర్తనశాల’ గురించి బాలయ్య ఏమంటున్నారంటే..
ఈ సినిమా విశేషల కోసం బాలకృష్ణ ఓ అరగంట నిడివి ఉన్న వీడియోను విడుదల చేశారు. అందులో సారాంశం ఇది. కళ్లు మూసుకుని కనేది కల.. కళ్లు మూసి నిద్రపోతున్న సమాజాన్ని మేలుకొలిపేది కళ. ‘నరసింహనాయుడు’లోని తన డైలాగ్ నిజజీవితంలో కూడా నిజమవుతోందన్నారాయన. నటన అనేది సామాన్యమైనది కాదని, వేరేవాళ్ల ఆత్మలోకి ప్రవేశించడమే నటనని అభివర్ణించారు. ‘చక్రవర్తి బిడ్డలు కూడా విరాట మహారాజు కొలువులో తలదాచుకోవలసి వచ్చింది. మహాభారతంలో అన్ని పర్వాల్లోనూ విరాటపర్వం చాలా విశిష్టమైనది. ఈ సినిమా ఉన్నది 15 నిమిషా నిడివే.. నిజానికి మేం రెండు సీన్లు మాత్రమే షూటింగ్ చేశాం. నటుల దగ్గర 10 రోజులు డేట్లు మాత్రమే తీసుకున్నాం. నేనే దర్శకత్వం వహించాను. నాది మానాన్న గారి స్కూలు దేనికైనా ప్రిపేర్ అవుతాం.
మా నాన్న గారి నుంచి నేను నేర్చుకున్నది ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం, కళాకారుడికి మర్యాద ఇవ్వడం, 10 రోజుల్లో అనుకున్న ముఖ్యమైన సన్నివేశాలను ఐదు రోజుల్లోనే పూర్తిచేశాం. నవరసాలు ఉన్న పర్వం విరాటపర్వం. అర్జునుడు బృహన్నలాగా ఉండటం, అక్కడ కాంతలకు నాట్యంలో శిక్షణ ఇవ్వడం, అభిమన్యుడు శశిరేఖల మధ్య రొమాన్స్ ఈ సినిమాలో ఉంటుంది’ అని వివరించారు. ఇందులో కీచకుడి పాత్ర కూడా ఉంటుందని బాలయ్య చెప్పారు. ఈ సినిమా చేయాలనేది తన జీవితాశయమని, కొంతమంది నటీనటులు దూరంకావడం, వారిని రీప్లేస్ చేసే అవకాశం లేకపోవడంతో ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. మరుపురాని పాత్ర ద్వారా కళామతల్లి రుణం తీర్చుకునే అవకాశం దొరికిందన్నారు.
తీసింది రెండే సీన్లు అయినా వాటిని బయటకు తీయాలని అనిపించిందని, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్లు.. ఏదేదో ఊహించుకున్నాం.. కానీ జరగలేదు. ద్రౌపదికి రీప్లేస్ మెంట్ నటులు తట్టకపోవడంతో ఆపేయాల్సి వచ్చిందని చెప్పారు. ‘ఈ సినిమా మళ్లీ చేయాలని ఉంది.. కానీ అది ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ సినిమాలో నాన్నగారిది ఓ డైలాగ్ ఉంది. ఈ రోజు విజయదశమి.. పనిప్రారంభించినా కూడా విజయం చేకూరుతుందనే డైలాగ్.. ఈ నవరాత్రులకు అది చాలా రెలవెంట్. నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.. మూడు నాలుగు గంటలు పూజలు చేస్తా. ధర్మరాజు కృత దుర్గాస్తవం అనేది ఉంది. అవి నేను రోజూ చదువుతాను. ధర్మరాజు సందిగ్ధావస్థలో ఉన్నపుడు వనవాసం 13 సంవత్సరాలు గడిచింది. ఇంకా ఒక్కసంవత్సరం గడవాలి.. ఏంచేయాలి నేను అని ధర్మరాజు అంటే అతనికి కృష్ణుడు దుర్గాస్తవం చేయమని సలహా ఇస్తాడు. ఆమె అదృశ్యరూపంలో మిమ్మల్ని కాపాడుతుందని కృష్ణుడు అంటాడు.
అలా అన్నీ ఈ సినిమాకి కలసి వచ్చి ఈ విజయదశమికి విడుదలవుతోంది. ఇందులో నాలుగు పాత్రలు చేద్దామని అనుకున్నా. ఒకటి అర్జునుడు, ఇంకోటి బృహన్నల, కీచకుడు, కృష్ణుడు.. ఇవి చేయాలనుకున్నా. నేనెప్పుడూ ఏదీ కమర్షియల్ గా ఆలోచించను. జనం కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నదే నా ఉధ్ధేశం. నాన్నగారు అప్పుడు జోలెపట్టుకుని ఎందుకు వెళ్లారు.. ఆయన జేబు నుంచి డబ్బులు ఇవ్వలేకా? ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే అని అప్పుడే అన్నారాయన. ఈ సినిమా ద్వారా వచ్చిన మొత్తాన్ని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి, వరద బాధితులను ఆదుకోవడానికే వినియోగిస్తాం. ఇందులో మిమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయడానికి ఈ ఏర్పాటు. ఇది కళామతల్లి నాకిచ్చిన వరంగా భావిస్తున్నా’ అని వివరించారు.
తను తీసిన ఆ రెండు సీన్లు ఐదారు నిమిషాలు ఉంటుందని, దానికి ఏమేమి జతపరిచానో, ఇంకా ఏమేం చేశానో చూస్తే మీకే తెలుస్తుందని చెప్పారు. ‘ఇందులో నాన్నగారు కనపడకుండా మాత్రం ఉండరు’ అని చెప్పడంతో ఇందులో నందమూరి తారకరామారావు పాత్ర కూడా ఉంటుందన్నది స్పష్టమైంది. ‘శ్రేయాస్ మీడియా ఈటీ, ఎన్ బీకే హౌస్ లో ఈసినిమాని చూడొచ్చు. నేను టైమ్ ని వృధా చేయను.. తెలియనివి తెలుసుకుంటాను. సమాజానికి మనం ఉపయోగపడుతున్నాం అనుకున్నపుడు అంతకుమించిన తృప్తి ఇక వేరేదేమీ లేదు. ఇన్ని కోట్లమంది ప్రేక్షకులతో నాకు అనుబంధం కలగడం నా పూర్వజన్మ సుకృతం’ అని బాలకృష్ణ ఈ సినిమా విశేషాలను వివరించారు.
-హేమసుందర్ పామర్తి