‘ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందా…!?’ ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే ప్రధాన చర్చనీయాంశం… అంతేకాదు దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఇదే…
ఎందుకంటే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ చేస్తున్న ఆందోళనలు 250రోజులు దాటాయి… ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా అప్పటికే ఎంపిక చేసిన రాజధానిని మూడుగా విభజించిన ఉదంతం లేదు…అందుకే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో అంతటి వ్యతిరేకత వచ్చింది. అందులోనూ ఓ అధునాతన రాజధాని తమ ప్రాంతంలో వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ ప్రాంత వాసులకు మూడు రాజధానుల అంశం నిరాశనే మిగిల్చింది. పేరుకు మూడు రాజధానులు అని చెబుతున్నప్పటికీ ప్రభుత్వ విధానం అమలులోకి వస్తే క్రియాశీల రాజధానిగా విశాఖపట్నం మాత్రమే ఉంటుందన్నది వాస్తవం.
మరి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ఆందోళనలు ఏ మేరకైనా ఫలించాయా అంటే జవాబు చెప్పలేం. అమరావతి పరిరక్షణ సమితి పోరాటం నేటికీ ఆందోళనలు, ధర్నాల స్థాయిలోనే మిగిలిపోయిందన్నది నిజం. అంతకుమించి ఉద్యమం, పోరాటం స్థాయికి తీసుకువెళ్లడంలో అమరావతి పరిరక్షణ సమితిగానీ … ఆ అంశాన్ని భుజానికి ఎత్తుకున్న టీడీపీకిగానీ సఫలం కాలేపోయాయి. ఇదే ప్రస్తుత పరిస్థితి.
ఆందోళనలు…ధర్నాలను మించిన ఉద్యమం కావాలి…
ప్రభుత్వ ప్రధాన విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఆందోళనలు, ధర్నాలకు పరిమితమైతే సరిపోదు. అందుకు ద్విముఖ వ్యూహం ఉండాలి. ఓ వైపు ప్రజాక్షేత్రంలో అందర్నీ కూడగట్టుకుని సమష్టిగా ఉద్యమించాలి. మరోవైపు న్యాయపోరాటం, ఇతరత్రా సాంకేతిక అంశాల ద్వారా పోరాడాలి. అప్పుడే ప్రభుత్వాలు దిగివస్తాయని మన రాష్ట్రంతోపాటు దేశంలో విజయవంతమైన అనేక ఉద్యమాలు చెబుతున్న చరిత్ర. మన రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాలోని ఉద్ధానం ప్రాంతంలోని సోంపేట థర్మల్ విద్యుత్తు ప్లాంట్‌కు వ్యతిరేకంగా విజయవంతంగా సాగిన ఉద్యమమే అందుకు ఉదాహరణగా ఉంది.
సోంపేటలో చిత్తడి భూముల్లో థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని దశాబ్దం క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ కూడా మద్దతు ఇచ్చింది. అంటే ఆ అంశానికి రాజకీయంగా ఎలాంటి ప్రతిఘటనా లేదు. కానీ చిత్తడి భూముల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయంగా ఎలాంటి మద్దతు లేనప్పటికీ ఆ ప్రాంతంలోని రైతులు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆ ప్రాంతంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, వైద్యులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
ఉద్దానం ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు సమష్టిగా ఉద్యమించి, ఆ చిత్తడి భూముల్లో ప్లాంట్ యాజమాన్యం కాలు పెట్టనివ్వకుండా అడ్డుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసినా… ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేసినా… ఉద్యమకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందినా… ప్రజలు వెనుకంజ వేయలేదు. మరోవైపు శాస్త్రీయ ఆధారాలతోసహా చిత్తడి భూముల పరిరక్షణ కోసం న్యాయపోరాటం చేశారు. జాతీయస్థాయిలో పర్యావరణవేత్తల మద్దతు సమీకరించారు. ఇలా అన్నిస్థాయిల్లో అన్ని వర్గాల్లో ఉద్యమించడంతో ప్రభుత్వం వెనకడుగు వేయకతప్పలేదు. థర్మల్ ప్లాంట్‌కు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాల్సి వచ్చింది. అదీ ప్రజా ఉద్యమం అంటే…
అమరావతిలో కనబడని ఉద్యమ స్ఫూర్తి
మూడు రాజధానుల విధాన నిర్ణయాన్ని కేవలం న్యాయస్థానాల ద్వారానే అడ్డుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి, చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. న్యాయపరమైన అంశాల్లో, అవగాహనలో తనకున్న అవగాహన అందుకు ఉపయోగపడుతుందన్నది చంద్రబాబు ఉద్దేశ్యం. దాంతో ప్రభుత్వం కూడా శాసన వ్యవస్థకున్న అధికారాలను ఉటంకిస్తూ బలంగా న్యాయపోరాటం చేస్తోంది. దాంతో ఈ అంశం శాసన, న్యాయ వ్యవస్థలకు పరిమితమైనదిగానే మారిపోయింది. అంతేతప్ప ప్రజా ఉద్యమం అనే కీలక విషయాన్ని మరుగునపరుస్తోంది.
ఉద్యమరూపం ఏదీ? ఎక్కడ?
అమరావతిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రాజధాని పరిరక్షణ కోసం చేస్తున్న ఆందోళనల్లో ఉండాల్సినంత స్థాయిలో తీవ్రత లేదన్నది పచ్చినిజం. అమరావతిలో షామియానాల కింద 250 రోజుల పాటూ కూర్చుంటూనే ఉన్నారు. ఈ శిబిరాల వద్దనే ప్రతిరోజూ పోరాటం మొదలై సాయంత్రానికి ముగుస్తోంది. మీడియా కవరేజీ, సోషల్ మీడియాలో హడావుడి ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ.. క్షేత్రస్థాయిలో క్రియాశీల పోరాటం కొరవడుతోంది.
అమరావతి ఆందోళన అన్నది ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన అంశంగా ప్రభుత్వం ముద్ర వేస్తోంది. ఆ ముద్రను చెరిపివేయడానికి అమరావతి పరిరక్షణ సమితి అప్పుడప్పుడూ కష్టపడుతోంది గానీ.. ఆ చొరవ సరిపోతుందో లేదో వారే బేరీజు వేసుకోవాలి.
అమరావతిని దాటి ఆందోళన విస్తరించలేదు. కనీసం ఇటు విజయవాడ అటు గుంటూరులో కూడా ఎలాంటి ఆందోళనలుగానీ ధర్నాలుగానీ కనిపించడమే లేదు. అమరావతికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు ఊపిరులూదడానికి చంద్రబాబునాయుడు తన వంతు ప్రయత్నం చేశారు గానీ.. ఆయన స్వయంగా వెళ్లిన సందర్భాల్లో తప్ప పెద్ద స్పందన రాలేదు. ఈలోగా కొవిడ్ వాతావరణం ఒక గండంలా మారింది. ప్రజలు ఎక్కడా బయటకు రాలేని పరిస్థితి.
పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఏర్పడితే కృష్ణా–గుంటూరు జిల్లాలకంటే రాయలసీమ ప్రాంతవాసులకే ఎక్కువ కష్టం…ఆర్థికభారం. కానీ ఆ విషయాన్ని రాయలసీమ ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ధ్యాసే టీడీపీకి లేకుండాపోయింది. ఇటు పశ్చిమ గోదావరి అటు గ్రేటర్ రాయలసీమలకూ కూడా ఆందోళనలు విస్తరిస్తే అది ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందుతుంది. దాంతో ప్రభుత్వం దిగిరాకతప్పదు. న్యాయపరమైన కారణాలను చూపించి ప్రభుత్వం గౌరవప్రదమైన రీతిలో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే అవకాశాలుంటాయి. అది తమ విజయంంగా చెప్పుకునేందుకు టీడీపీకి పూర్తి హక్కు ఉంటుంది. కానీ చంద్రబాబు ఆ లాజిక్ మిస్ అయ్యారు. అమరావతి పరిరక్షణ సమితి కూడా ఆ దిశగా ఆలోచించి ఆందోళనలను ఉద్యమస్థాయికి తీసుకువెళ్లడం లేదు. ఆందోళనలు చేస్తూ 250రోజులు పూర్తి చేసుకున్నాయి కానీ నేటికీ ఉద్యమ స్థాయికి చేరుకోలేదు. ఇప్పటికైనా అన్ని ప్రాంతాలు, వర్గాలను కలుపుకుని ఆందోళనలను టాప్‌గేర్‌లోకి తీసుకువెళ్లి ఉద్యమరూపం ఇస్తే తప్ప అమరావతి పరిరక్షణ అన్నది సాధ్యం కాదన్నది వాస్తవం.