సోషల్ మీడియా విశ్వరూపం దాల్చి ఉన్న ఈ రోజుల్లో.. ఒక అబద్ధం- ప్రపంచంమొత్తం వ్యాపించిపోవడానికి కొన్ని సెకన్ల సమయం చాలు.
నిజానిజాల్ని చెక్ చేసుకుని వార్తల్ని ప్రచురించేంత సమయం మీడియా సంస్థలకు ఉండడం లేదు. ఆ నిజాల నిర్ధరణ కంటే వేగంగా, హాట్ హాట్ గా ప్రజలకు వార్తను వడ్డించడం వారికి తక్షణ కర్తవ్యం అనిపిస్తోంది. పైగా ‘మేమే నిజం చెప్పాం’ అనే నిబద్ధతను మర్చిపోయి.. ‘మేమే ముందు చెప్పాం’ అనే అవాంఛితమైన స్పీడ్ యుగంలో ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు వేలంవెర్రిగా పరుగులు తీస్తున్న వేళ.. తప్పుడు వార్తలు ప్రచారం లోకి వచ్చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.
కేవలం పత్రికలు ఉన్నరోజుల్లో ఇలాంటి తప్పులు తక్కువ జరిగేవి. ప్రింటింగ్ మొదలయ్యేలోగా.. అందరూ జరిగిన విషయాల్ని, జరుగుతున్న ప్రచారాల్ని ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని వార్తలు అందించే వాళ్లు.
ఎక్కువ ప్రింటింగ్ యూనిట్లు ఉన్న బలంతో అర్ధరాత్రి వరకు సంఘటనలు జరిగిన తెల్లారేలోగా వాటిని ప్రజలకుఅందించే వెసులుబాటు ఉన్న ఈనాడు ఆరోజుల్లో కొన్ని తాజా వార్తలు కవర్ చేసినప్పుడు.. అవి నిజమే అయినా.. ప్రజలకు అప్పటిదాకా తెలియని కారణంగా వివాదాలు రేగిన సందర్భాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు.. కొన్ని జిల్లాలకు కేవలం ఈనాడు ద్వారా మాత్రమే ఆ విషయం తెలిసింది. కాంగ్రెస్ అభిమానులు ఆ విషయాన్ని నమ్మకుండా.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని నిందిస్తూ ఈనాడు పత్రికల్ని రోడ్ల మీద తగలబెట్టడం జరిగింది. దాన్ని తప్పుడు వార్త అనుకున్నారు.
టీవీ న్యూస్ ఛానెళ్ల హవా మొదలైన తర్వాత.. ‘ముందే చెప్పాం’ అనేది ఛానెళ్ల మధ్య పోటీకి ఒక తూకం రాయిగా మారిన తర్వాత.. అవాంఛనీయ పోకడలు ప్రవేశించాయి. ఎవరైనా సెలబ్రిటీ ఆస్పత్రిలో ఎడ్మిట్ అయితే చాలు.. ఎప్పుడెప్పుడు చచ్చిపోతాడా? అని కాపుకాయడం అలవాటైంది. అంతకుముందు కూడా.. పత్రికల్లో ఇలాంటి కసరత్తు ఉండేది. అనారోగ్యంతో ఎవరైనా సెలబ్రిటీ పరిస్థితి విషమంగా ఉంటే.. చనిపోగానే కథనాలు ఇవ్వడానికి ముందే సిద్ధం చేసి పెట్టుకునే వారు. కానీ.. అలాంటి కసరత్తు ఆఫీసు దాటి బాహ్యప్రపంచానికి తెలిసేది కాదు. టీవీ ఛానెళ్లు వచ్చాక.. హాస్పిటల్ ముందు.. లైవ్ వెహికిల్స్ పెట్టుకుని నిరీక్షిస్తూ.. ‘ఎప్పుడు చచ్చిపోతాడా?’ అని ఎదురుచూడడం రూపేణా.. మీడియా పోకడలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలోనే.. ముందే ప్రజలకు తాము వార్త చేయవేయాలనే ఆశతో.. ‘.. మనకికలేరు’ అంటూ ముందుగా వార్తలు ఇచ్చేసి, తర్వాత చానెళ్లు నాలుక కరచుకున్న సందర్భాలు అనేకం. ఆ పోటీలో భాగంగానే.. ఒక ఛానెల్లో చావు వార్త, మరో ఛానల్ లో పరిస్థితి విషమం అనే వార్త అటూ ఇటూ చూస్తూ ప్రజలు గందరగోళానికి గురైన సందర్భాలు అనేకం. వెబ్ సైట్ల హవా వచ్చాక ఇదే పోకడ కొనసాగుతోంది.
వార్త కరెక్టా కాదా చెక్ చేసుకోకుండానే పబ్లిష్ చేసేయడం. తప్పని తెలిస్తే.. ఆ తర్వాత నిదానంగా దిద్దుకోవడం వెబ్ సైట్లకు చాలా సులువైన పని అయిపోయింది. సోషల్ మీడియా విజృంభణ మొదలైన తర్వాత.. అసలు వార్త అనేదానికే విలువ లేకుండాపోయింది. అసలు ఎవరూ చావాల్సిన అవసరమే లేదు.. చావుదాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. ముందే సంతాప సందేశాలు వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అయిపోతుంటాయి. అలాంటి అసహ్యమైన పోకడలకు నిన్నటి పరిణామాలు కూడా ఒక ఉదాహరణ. తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి.. ఆస్పత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి బాగాలేదు. అందుకే సీఎం, మంత్రులు ఆస్పత్రిని సందర్శించారు. -అంతవరకే వార్త.
అయితే.. సోషల్ మీడియాలో మాాత్రం సాయంత్రం నుంచే ఆయనకు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఆయన ఫోటోను అందంగా ఇరువైపులా దీపస్తంభాల బొమ్మలతో- నివాళి యాడ్ లాగా డిజైన్ చేసి.. సర్కులేట్ చేయడం ప్రారంభించారు. తీరా ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించారు. ఒకరి చావు మీద ఇంత అత్యుత్సాహం ఎందుకు? సోషల్ మీడియా ఇలాంటి దుర్మార్గమైన అసహ్యకరమైన ప్రచాారాలకు తెరతీస్తోంటే.. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ సైట్లు అక్కడినుంచి అబద్ధాల్ని అందిపుచ్చుకుని.. గోరంతలు కొండంతలుగా అల్లుకుపోతున్నాయి. గొర్రెదాటుగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఇలాంటి అబద్ధపు వార్తల ప్రచారాల్ని అరికట్టడం మన బాధ్యతే అని తెలుసుకోకుంటే.. మీడియా పరువు పోతుంది.
ఎన్‌కౌంటర్ కోరిక మరీ ఘోరం..
ఇలాంటి ఊహాగానాలు రాయడంలో మీడియా ఇవాళ (గురువారం) మరీ శృతితప్పింది. వేగంగా వార్తలు ఇవ్వాలనే అత్యుత్సాహమో.. ఇంకేదైనా పైత్యమో తెలియదు గానీ.. ఒక కేసులో తప్పు చేసిన వాళ్లు పోలీసులకు దొరికినట్లుగా ఇలా వార్త రాగానే.. వెంటనే.. ఎన్ కౌంటర్ కూడా జరిగిపోయినట్లు కథనాలు అల్లి ప్రచురించేశారు.
పిల్లాడిని చంపేశారనే వార్త బయటకు వచ్చిన తర్వాత.. దీనికి సంబంధించి నలుగురిని/ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా వార్తలు వచ్చేశాయి. గతంలో సంఘటనల్ని దృష్టిలో ఉంచుకుని.. ఇలాంటి నేరం బయటపడ్డాక ఎట్టిపరిస్థితుల్లో ఎన్ కౌంటర్ చేసేస్తారని మీడియా ఫిక్సయిపోయినట్టుంది. అందుకే అలాంటి పుకారు మొదలు కాగానే.. అర్జంటుగా ఒక క్వశ్చన్ మార్క్ (?) పెట్టేసి ఎన్ కౌంటర్ చేసేసినట్టుగా వార్తలు పెట్టారు.
ఏదో చిల్లరగా నడిచే వెబ్ సైట్లు ఇలాంటి వార్తలు పెడితే అదొక తీరు. వాటిని చూసే వారు పెద్దగా ఉండరని అనుకోవచ్చు. కానీ.. సాక్షి, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ దినపత్రికలకు అనుబంధంగా ఉండే వెబ్ సైట్లు కూడా ఇలాంటి పనే చేస్తే ఎలా అర్థం చేసుకోవాలి. సర్కులేషన్ పరంగా గాని, వ్యూస్ /క్లిక్స్ పరంగా గానీ పెద్ద పత్రికలు.. అలాంటి ‘పెద్ద’ హోదాకు చేరుకునే కొద్దీ.. మరింత బాధ్యతగా వార్తలు అందించాలి. సోషల్ మీడియాలో వందల పుకార్లు రావడం ఒక ఎత్తు.. బాధ్యతాయుతమైన ఇలాంటి పత్రికల వెబ్ సైట్స్‌లో వార్తగా రావడం మరో ఎత్తు. పత్రికల్లో (వాటి వెబ్ సైట్స్ లో) వస్తే.. అబద్ధాన్ని కూడా నిజమని ప్రజలు నమ్ముతారు. ఈ స్పృహ పాత్రికేయుల్లో ఉండాలి.
ఈ పుకార్లు ఎంతగా విస్తరించాయంటే.. పోలీసులు వీటికి వివరణ ఇచ్చుకున్నారు. ప్రస్తుతానికి ఒక్కరు మాత్రమే పట్టుబడ్డారని, ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేసినట్టుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని తేల్చారు.
నిజానికి.. వాతావరణం అలాగే అనిపించింది. కిడ్నాప్ అయిన బాలుడు హత్యకు గురైనట్లు వార్త వచ్చిన తర్వాత.. అదనపు పోలీసు బలగాల్ని తరలించడం, రోప్ పార్టీలను తీసుకెళ్లడం ఇలాంటి వ్యవహారాలన్నీ ఎన్‌కౌంటర్ జరుగుతుందనే అభిప్రాయం కలిగించేలా సాగాయి. స్థానిక విలేకర్లతో మాట్లాడినప్పుడు.. ‘ఇంకా కాలేదు.. కానీ, అయితది’ అనే మాటే వినవచ్చింది. ఒకవేళ ఎన్ కౌంటర్ జరగవచ్చేమో కూడా.. కానీ, బాధ్యతగల పత్రికలు నిజానిజాలు చెక్ చేసుకోకుండా ‘క్వశ్చన్ మార్క్ (?)’ పెట్టి అబద్ధాలను ప్రచారంలో పెట్టేయవచ్చు కదా.. అని మీడియా విలువల్లోని లొసుగుల్ని వాడుకుని.. ఇలా చెలరేగితే ఎలా? మనం ఓసారి మన ప్రవర్తన తీరు తెన్నల్ని సమీక్షించుకోవాలి.
.. సురేష్ పిళ్లె