ఢిల్లీ బీజేపీ నేతల చూపు ఇప్పుడు హైదరాబాద్ గల్లీకి మళ్లింది. త్వరలో వరుసగా హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్లు జరగనున్నాయి. దీంతో బీజేపీ అగ్ర నేతల దృష్టి తెలంగాణవైపు మళ్లింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ ఎన్నికల గెలుపుపై ఢిల్లీ అధినాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సికింద్రాబాద్ బీజేపీఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలతో ఢిల్లీ నాయకత్వం ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ఎన్నికల అంశంపై దిశానిర్ధేశం చేస్తున్నారట. వరదల బీభత్సంతో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని మనవైపు తిప్పుకోవాలని సూచించిందట.
గ్రేటర్‌లో పాగా కోసం..
గ్రేటర్‌లో ఎన్నికల్లో పాగా వేయడానికి బీజేపీ తెగ ఆరాటపడుతుంది. ప్రతీ సారీ బీజేపీకి ఓటమి తప్పట్లేదు. దీంతో ఈసారి జరిగే గ్రేటర్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ ఉబలాట పడుతోంది. హైదరాబాద్ నగరం నుంచి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవిలో ఉన్నారు. దీంతో కిషన్‌రెడ్డి.. గ్రేటర్ ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న డివిజన్లపై ఎక్కువగా దృష్టి సారించి పార్టీ నాయకులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సిద్ధం కావాలని సమాయత్తం చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై గురి…
కరోనా, వరదల విషయంలో ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజలకు తెలిసేలా బాగా ప్రచారం చేసేలా పార్టీనేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్, డబుల్‌బెడ్ రూమ్, వరదలు తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారట. ఈ ముఖ్యమైన పాయింట్లను ప్రజలకు వివరించేలా క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారట. మోర్చా కమిటీలు, డివిజన్, బూత్ కమిటీలపై ఈ సారి ఎన్నికల ప్రచార బాధ్యతలు ఎక్కువగా పెట్టినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని డివిజన్లన్నీ బీజేపీయే గెలిచేలా పక్క వ్యూహాలను కిషన్‌రెడ్డి అమలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక సోషల్ మీడియా టీంలను కూడా ఈ సారి రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి అయికూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంలోని మెజార్టీ డివిజన్ సీట్లు గెలవకుంటే రాజకీయ మైలేజీలో వెనుకబడే అవకాశం ఉంటుందని కిషన్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ఈక్రమంలోనే ఎక్కువగా తన దృష్టంతా సికింద్రాబాద్‌పైనే పెట్టినట్లు తెలిసింది.