హీరో కృష్ణ నట వారసుడిగా సినిమా రంగంలో రమేశ్ బాబు అడుగుపెట్టడానికి దారితీసిన పరిణామాలు ఆసక్తికరంగా ఉంటాయి. మహానటుడు ఎన్టీఆర్, కృష్ణల మధ్య ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా తర్వాత విభేదాలు తలెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఇద్దరూ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి తలెత్తింది.
ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమా తలపెడితే, కృష్ణ దానికి పోటీగా కురుక్షేత్రం తీశారు. ఈ రెండు సినిమాలు 1977 జనవరి 14న విడుదలయ్యాయి. దానవీర శూరకర్ణ హిట్ అయితే, కురుక్షేత్రం మాత్రం ఫ్లాప్ అయ్యింది. వీరిద్దరి మధ్య విభేదాలు చాలా కాలం కొనసాగాయి. కృష్ణ ఏది చేసినా సాహసమే. అందేరూ డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయ్యారు. పెద్ద హీరోలందరూ తమ నట వారసుల్ని తీసుకువచ్చేశారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ వచ్చారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జునతో తెరంగేట్రం చేయించారు.
వారసులంతా వచ్చేశారు
ఇక నిర్మాత రామానాయుడు తన వారసుడు అంటూ వెంకటేష్ ను హీరోని చేశారు. ఎన్టీఆర్ సోదరుడైన నిర్మాత త్రివిక్రమరావు తన కుమారుడు కళ్యాణ చక్రవర్తిని హీరోని చేశారు. దాంతో కృష్ణ కూడా తన పెద్ద కుమారుడు రమేశ్ బాబును హీరోని చేయాలనుకున్నారు. తెరకు పరిచయం చేసే ముందే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. డైలాగ్ మాడ్యులేషన్ నేర్పించారు. నటన, ఫైట్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. హిందీలో మంచి హిట్ అయిన బేతాబ్ హక్కులు కొనుగోలు చేశారు. దీనికి పరుచూరి బ్రదర్స్ తో మాటలు రాయించారు.
బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరిని పిలిపించి పాటలు రికార్డ్ చేయించారు. తనతో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కెమెరామన్ గా పనిచేసిన వీఎస్ఆర్ స్వామిని సినిమాటోగ్రాఫర్ గా నియమించారు. దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలి అన్న చర్చ మొదలైంది. కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబును ఎన్నుకున్నారు. అలా ఈ సినిమా ప్రారంభోత్సవం మద్రాసులోని ఏవీఎం స్టూడియోలో 1986లో ఆగస్టు 29న ప్రారంభమైంది. ఎన్టీఆర్ తో మాటలు లేనందున ఏయన్నార్ ను మాత్రమే ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. కానీ దర్శకుడి పనివిధానం నచ్చకపోవడంతో అతడి స్థానంలో విక్టరీ మధుసూదనరావుకు బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది.
ఇక్కడా టార్గెట్ ఎన్టీఆరే
ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ పై పోటీగానే తన కుమారుడు రమేశ్ ను కృష్ణ సినిమాల్లోకి తెచ్చారన్న ప్రచారం అప్పట్లో ఎక్కువగా జరిగింది. మరో విశేషమేమిటంటే ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ హీరోగా సామ్రాట్ అనే సినిమా రూపొందుతోంది. దాంతో కృష్ణ తన కుమారుడు సినిమా పేరును సామ్రాట్ గా పెట్టారు. ఇది కూడా అప్పట్లో చర్చనీయాంశం. అందుకే బాలకృష్ణ నిర్మాతలెవరూ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరుకాలేదు. ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని తన సొంత బ్యానర్ పద్మాలయపైన నిర్మించారు. చివరికి ‘సామ్రాట్’ టైటిల్ వివాదాస్పదం అయ్యింది. ఒకే టైటిల్ రెండు సినిమాలకు ఉండటమే దానికి కారణం. చివరికి ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కేదాకా వెళ్లింది.
కోర్టు తీర్పు ప్రకారం ఈ టైటిల్ కృష్ణ సినిమాకే దక్కింది. దాంతో బాలకృష్ణ సినిమా పేరును ‘సాహస సామ్రాట్’ గా మార్చుకోవలసి వచ్చింది. బాలకృష్ణ సాహస సామ్రాట్ 1987 ఏప్రిల్ 13న విడుదల కాగా, రమేశ్ ‘సామ్రాట్’ అదే ఏడాది అక్టోబరు2న విడుదలైంది. తొలి సినిమా బాగానే ఆడినా తన కెరీర్ మీద రమేశ్ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా సరిగా ఆడలేదు. వారసత్వం కొన్ని సినిమాలకే పనిచేస్తుందనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అలా హీరోగా కనుమరుగయ్యారు.. ఆ తర్వాత నిర్మాతగా మారి.. ఇప్పుడు భౌతికంగానూ దూరమయ్యారు. తన వారసుడి తెరంగేట్రాన్ని చూడకుండానే కన్నుమూశారు.











