ఒకనాటి సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు ఆకస్మికంగా కన్నుమూయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యం అంటే ఎలాంటి అనారోగ్యం? ఆయనకు పిల్లలు ఎంత మంది? లాంటి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేయ వ్యాధితో చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఓ పక్క కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఆరా తీస్తే తేలింది ఏమిటంటే ఆరోగ్యం విషయంలో ఆయన ఏ మాత్రమూ శ్రద్ధ వహించరు. విపరీతంగా మద్యం అలవాటు ఉండటం వల్ల లివర్ చెడిపోయింది. దానికి తోడు ఇంట్లోనే కరోనా కేసులు ఉన్నాయి.
ప్రస్తుతం మహేశ్ బాబు కూడా కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. వారి కుటుంబలో ఇంకా కొంతమందికి కూడా కరోనా ఉన్నట్లు సమాచారం. కరోనాని పక్కన పెడితే రమేశ్ బాబుకు ఉన్న అలవాట్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. అందువల్లే కనీసం 60 ఏళ్లు నిండకుండానే 56వ ఏట కన్నుమూశారు. హీరోగా నిలదొక్కుకోలేకపోవడానికి సరైన హిట్లు లేకపోవడం కూడా ఓ కారణం. దానికి తోడు స్థూల కాయం. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోవడం. నిన్న శ్వాస తీసుకోవడం కష్టమవడంతో ఆస్పత్రికి తరలించారు. కాలేయం చెడిపోవడంతో కొంత కాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఉదయాన్నే పద్మాలయా స్టూడియోలో రమేశ్ బాబు పార్థివ దేహాన్ని ఉంచారు.
రమేశ్ కుటుంబం వివరాలు ఇవీ..
రమేశ్ బాబు భార్య పేరు మృదుల. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు. కుమార్తె పేరు భారతి. ఆమె విదేశాల్లో చదువుకుంటోంది. కుమారుడి పేరు జయకృష్ణ. అతను అచ్చు గుద్ది నట్టు బాబాయి మహేశ్ పోలికల్లోనే ఉంటాడట. అతడ్ని హీరోగా చేయాలనే ప్రయత్నాల్లో కూడా రమేశ్ బాబు ఉన్నారు. కుమారుడు జయకృష్ణకు ముంబైలో నటనలో శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండి డ్యాన్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలోనే అతడ్ని హీరోగా పరిచయం చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈలోగానే ఆయన తుది శ్వాస విడిచారు.
నిరాడంబరంగా అంత్యక్రియలు
రమేశ్ బాబు పార్థివ దేహానికి నిరాడంబరంగానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్థివ దేహం వద్దకు మీడియాను కూడా అనుమతించడం లేదు. పద్మాలయ స్టూడియో గేటు బయటే ఉండి మీడియా కవరేజీ చేసుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన సంతాప సందేశాన్ని పంపారు. పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాలను ప్రకటించారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదితరులున్నారు.











