ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టడం విశేషం. దీనికి ‘నారప్ప’తో నాంది పలికిన సంగతి తెలిసిందే. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే బడా సంస్థల సహకారం కూడా అవసరమని భావించినట్టుంది. దాంతో డిజిటల్ మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘బిలీవ్’ తో కలిసి ముందుకు సాగడానికి నిర్ణయించింది. ఎస్పీ మ్యూజిక్ అనే లేబుల్ తో తొలిసారిగా ‘నారప్ప’ ఆడియోను తీసుకొచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. దీనికి ప్రేక్షకుల ఆదరణ కూడా బాగుంది.
ఈ నేపథ్యంలో పారిస్ కు చెందిన ‘బిలీవ్’ కంపెనీతో ఎస్.పి. మ్యూజిక్ ఒప్పందం కుదుర్చుకుంది. వీరిద్దరి భాగస్వామ్యంలో ‘నారప్ప’ మ్యూజిక్ ను ప్రపంచ మ్యూజిక్ డయాస్ పై నిలబెట్టే బాధ్యతలను బిలీవ్ తీసుకుంది. ఇక బిలీవ్ విషయానికి వస్తే ఔత్సాహిక గాయకులు, సంగీతకారులకు ఓ వేదికను కల్పిస్తూ ఈ సంస్థ ముందడుగు వేస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద డిజిటల్ మ్యూజిక్ కంపెనీగా ఎస్టాబ్లిష్ అయ్యింది.
గతంలో ‘బిలీవ్ ఇండియా’ రానా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ సౌత్ బేతో కలిసి ముందుకు సాగింది. అదిప్పుడు మరింత ముందుకు వెళ్లి ఈ రెండు సంస్థలూ కలిసి సాగే వరకూ వెళ్లింది. బిలీవ్ తో కలిసి ముందుకు వెళ్లడం తమకు దక్కిన మంచి అవకాశంగా నిర్మాత సురేష్ బాబు చెబుతున్నారు. తమ భాగస్వామ్యం మరెన్నో చిత్రాలకు కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సంగీత రంగంలో తొలి అడుగువేసిన సురేష్ సంస్థ మున్ముందు మరెన్ని కొత్త మార్గాలకు తలుపులు తెరుస్తుందో చూడాలి.
Must Read ;- సినిమా కోట్లు దాటుతున్నా నిర్మాత గడప దాటడే!











