సినిమా థియేటర్ల శుభారంభం జరగబోతోంది. జులై 30 నుంచి సినిమాలు విడుదలవుతున్నాయి. పిల్లి మెడలో గంటకట్టాలంటే పెద్ద వారు సాహసించరు కాబట్టి చిన్న సినిమాలు ముందుకొచ్చియి.
నరసింహపురం, ఇష్క్, తిమ్మరుసు చిత్రాలు జులై 30న విడుదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్ లతో కలిపి 2100 థియేటర్లు ఉన్నాయి. వీటిలో కేవలం 300 నుంచి 400 మాత్రమే థియేటర్లు ప్రారంభమవుతున్నాయి. పెద్ద సినిమాలు రిలీజైతే తప్ప పూర్తి స్థాయిలో థియేటర్లన్నీ ప్రారంభం కావడం సాధ్యం కాదు. పూర్తిస్థాయిలో థియేటర్లు ప్రారంభం కావడానికి మరో రెండు వారాలు పడుతుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు విడుదల కావాలంటే సెన్సార్, పబ్లిసిటీ తదితర అంశాల కోసం రెండు వారాల సమయం పడుతుంది.
దాదాపు 20 పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నా పెద్ద నిర్మాతలెవరూ అంత తొందరగా సినిమాలు విడుదల చేయటానికి సిద్ధంగా లేరు. అందువల్ల పైన పేర్కొన్న మూడు సినిమాలు మాత్రం జులై 30న ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాయి. జులై 23 న ఓ చిన్న సినిమా కేవలం 14 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. దానికి లభించిన స్పందన అంతంత మాత్రమే. విడుదలయ్యే ఈ మూడు సినిమాల్లో దేనికైనా పాజిటివ్ టాక్ వస్తే థియేటర్ల సంఖ్య పెరగటానికి అవకాశం ఉంటుంది.
పెద్ద సినిమాలు 20 రెడీగా ఉన్నా విడుదల చేయడానికి నిర్మాతలెవరికీ ధైర్యం సరిపోవడం లేదు. వీటికి లభించే స్పందన చూసి తర్వాత విడుదల చేయాలన్నది వీరి నిర్ణయం. మరో రెండు చిన్న సినిమాలు ఉన్నాయి గానీ ఈ రేట్ల మీద వేసే పరిస్థితి లేదు. తెలంగాణలో 100 శాతం సీటింగ్, ఆంధ్రాలో 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో విడుదలవుతున్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రాలో మూడు షోలకు మాత్రమే అనుమతి ఉంది.
రేట్లు లేవనే కారణంగా నిర్మాతలు కూడా తమ సినిమాలు విడుదల చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. సాధారణంగా ఈ రేట్లు సరిపోతాయి. కానీ ధరలు పెంచాలన్న డిమాండు ఉంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లో రెండు రకాల ధరల విధానం ఉంది. తెలంగాణలో 100, 150గా అత్యథిక టిక్కెట్ ధర ఉంటే ఆంధ్రాలో మాత్రం 70 రూపాయలే ఉంది. టిక్కెట్ ధర పెంచుకోడానికి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నా జగన్ సర్కారు స్పందించడం లేదు. ప్రస్తుతం ఇది కోర్టు పరిధిలో ఉంది.
నిబంధనలేమిటన్న హైకోర్టు
టిక్కెట్ల ధరలను నిర్ణయించడానికి ఎలాంటి నిబంధనలను ఫ్రేమ్ చేశారని ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. దీని కోసం ఓ కమిటీని ఏర్పాటుచేసినట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కూడా చెప్పారు. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లోగా ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ , హోం శాఖ సెక్రెటరీ లను కూడా హై కోర్టు ఆదేశించింది. ఏపీలో టిక్కెట్ల రేట్లు తేలే వరకూ పెద్ద సినిమాల విడుదల కష్టమే.
ఏపీలో ప్రభుత్వ ఆదేశాల మేరకే..
ఏపీలో ప్రభుత్వ ఆదేశాల మేరకే సినిమా టిక్కెట్ ధరలు ఉండాలని జగన్ సర్కారు ఆంక్షలు విధించింది. సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కరోనా కారణంగా చాలామంది జీవనోపాధి దెబ్బతిందనేది ప్రభుత్వ అభిప్రాయం. ఓ వైపు పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారడం, కరోనా సెకండ్ వేవ్.. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. థియేటర్ల యాజమాన్యం టికెట్ రేట్లను పెంచేస్తే ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
అయితే రాయితీల మీద ప్రభుత్వం దృష్టిపెడితే బాగుంటుంది. పన్ను మినహాయింపు, కరెంట్ బిల్లుల రద్దు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆస్తి పన్ను కూడా రద్దు చేయమని థియేటర్ల యాజమాన్యాలు కోరుతున్నాయి. మొత్తానికి థియేటర్లలో బొమ్మ పడటం కొంత ఉపశమనం కలిగించే వార్తే.
Must Read ;- సినిమా కోట్లు దాటుతున్నా నిర్మాత గడప దాటడే!











