యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘అల్లుడు అదుర్స్’. అనూ ఇమ్మాన్యుయేల్ , నభా నటేష్ జంటగా నటించిన ఈ సినిమా.. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కింది. బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ఐటెమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుండగా.. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ రోజు ‘అల్లుడు అదుర్స్’ ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే.. కామెడీ, యాక్షన్ తో పాటు ఇందులో హారర్ పార్ట్ ను కూడా జోడించారని అర్ధమవుతోంది. నిజానికి రామ్ చేయాల్సిన ఎనర్జిటిక్ కేరక్టర్ ను బెల్లంకొండ తో చేయించారని అర్ధమవుతోంది. అయితే ఈ సినిమాకి రామ్ హీరో అయ్యుంటే.. సినిమా కథ వేరే ఉండేదని వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాగే.. ప్రకాశ్ రాజ్ విలనీ, సోనూ సూద్ కామెడీ విలనీ ఈ సినిమాకి కొత్త రకంగా ఉండబోతోంది. ఇక జబర్దస్త్ ఫేమ్ చమ్మక్ చంద్ర, రచ్చరవి, గెటప్ శ్రీను కామెడీ కూడా హైలైట్ కాబోతోంది. దేవీశ్రీ ప్రసాద్ మాస్ సాంగ్స్ తో ఈ సినిమా ఈ సంక్రాంతికి జనాన్ని అలరిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కేవలం యాక్షన్ మూవీస్ తోనే బండి లాగించే బెల్లంకొండ బాబు.. ‘అల్లుడు అదుర్స్’ లో మాత్రం కామెడీ కూడా దానికి జత చేశాడు. మరి అతడి ప్రయత్నం ఈ సినిమాతో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.