ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కావడంతో.. ఇవాళ క్రిస్‌మస్ పర్వదినం సందర్భంగా.. ఆయన పార్టీలోని నాయకులు.. ఆయన ‘గుడ్ లుక్స్’లో పడాలని ఉవ్విళ్లూరుతూ ఉండేవాళ్లు.. అధినేతకు భజన చేయడంలోనే తమ జీవిత పరమార్థం దాగి ఉందని తలపోసే వాళ్లు.. ఇలా ప్రతి ఒక్కరూ క్రిస్ మస్ పర్వదినాన్ని సెలబ్రేట్ చేయడం అసహజం కాదు. పార్టీ అధినేతకు క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలియజేయడమూ, దయామయుడిగా గుర్తింపు ఉన్న జీసస్ పుట్టినరోజు గనుక.. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించే ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడమూ అన్నీ మంచి పరిణామాలే. ఇప్పటికే పార్టీ నాయకులందరూ కూడా అదే పనిలో ఉన్నారు.
ప్రభు ప్రీత్యర్థం తమ వ్యవహార సరళిని తీర్చిదిద్దుకునే వైఖరి రాజకీయాల్లో చాలా ఎక్కువగానే ఉంటుంది. అదే సమయంలో.. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఏకధ్రువ పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ లో ఇలాంటి పోకడలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే అందరూ అదే పనిలో ఉంటారు. అయితే అందరిలోనూ తాను కాస్త భిన్నంగా కనిపించాలని అనుకున్నారో ఏమో గానీ.. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఓ అడుగు ముందుకేసి వివాదంలో చిక్కుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలోనే ఆయన అక్కడి భక్తులందరికీ క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెప్పడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి ఆలయ ఆవరణలోంచే సీఎం జగన్‌కు, దెందులూరు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి తీరు పట్ల భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం తప్పు కాదు. కానీ.. ఎక్కడినుంచి ఆ మాట చెబుతున్నారో.. ఆ స్థలానికి కూడా విలువ ఇవ్వాలి. తన ఇల్లు, ఆఫీసు నుంచి ఆయన క్రిస్టియన్ సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్పినా.. క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. అయితే.. హిందువులు పవిత్రంగా భావించే, రాష్ట్రంలోని ప్రఖ్యాత వైష్ణవ ఆలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల ఆలయంలో.. అదికూడా అక్కడి భక్తులను ఉద్దేశించి క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెప్పడాన్ని ఆయన ఎలా సమర్థించుకుంటారు. అత్యుత్సాహానికి పోయి.. వివాదంలో చిక్కుకున్నారని అందరూ విమర్శిస్తున్నారు.
Must Read ;- ఆశీస్సులు పంపండి.. పెళ్లికి రాకండి..!
వరుస విమర్శలకు ఇది ఊతమిస్తుందా?
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన ప్రారంభించిన తర్వాత.. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయనే ప్రచారం చాలాకాలం నుంచి ఉంది. తిరుమలలో అన్యమత ప్రచారం గురించి కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టికెట్లపై ఏసుక్రీస్తు ప్రచారం, తిరుమలలో తరచుగా క్రైస్తవ ప్రచారకులు కనిపించడం వంటి వ్యవహారాలు ప్రభుత్వ ప్రతిష్టను ప్రశ్నార్థకం చేశాయి. ఆరోపణలు వచ్చినప్పుడెల్లా.. పాలకపక్షంలోని పలువురు డొంకతిరుగుడు సమాధానాలతో దాటవేస్తూ వచ్చేవారు. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా ఆలయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం వంటి పని వివాదాస్పదం అవుతోంది.