తెలంగాణలో దాదాపుగా మందుబాబులు మద్యం లేకుండా ఏ పండుగను జరుపుకోరు. మరి అలాంటిది దసరా పండుగ వచ్చిందంటే ఊరుకుంటారా మరీ. మద్యం ఏరులై పారాల్సిందే. అసలే దసరా పండుగను తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. కేవలం నాలుగు రోజుల్లోనే వందల కోట్ల రూపాయల మద్యాన్ని గుటకలేస్తూ తాగేశారు. దీంతో ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది.
812.24 కోట్ల మద్యం విక్రయాలు..
దసరా పండుగ నేపథ్యంలో మద్యం వ్యాపారులు సాధారణ రోజుల కంటే పండుగ ముందు రోజుల్లో భారీ మొత్తంలో కాటాన్ల కొద్ది మద్యాన్ని లిఫ్ట్ చేశారు. 4 రోజుల్లోనే రూ.812.24 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది. కేవలం నాలుగు రోజుల్లోనే 812.24 కోట్ల రూపాయల మద్యాన్ని మందుబాబులు తాగేసినట్లు తెలిసింది. సాధారణ రోజుల్లో మద్యం షాపుల యజమానులు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి రోజుకు రూ.80-90 కోట్ల విలువైన మద్యం, బీరును తీసుకుంటారు.
కానీ ఈనెల 22వ తేదీన ఒక రోజే రూ.305.96 కోట్ల ఖరీదు మద్యాన్ని, బీరును లిఫ్ట్ చేశారు. ప్రతి నెల ప్రభుత్వానికి రూ. 2,200 కోట్ల వరకు ఆదాయం సాధారణ రోజుల్లో వచ్చేది. కానీ ఈ నెల 27 వరకే రూ.2,200 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 31 వరకు ఈ రాబడి రూ.2,500 కోట్లకు దాటే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల అంచనా.
కరోనాను లెక్క చేయకుండా..
కరోనా కేసులు నమోదవుతున్నా మద్యం ప్రియులు మద్యం సేవించే విషయంలో అస్సలు వెనకడుగు వేయడంలేదు. కరోనా.. కరోనే.. పండుగ.. పండుగే.. అని దసరా నేపథ్యంలో మందుబాబులు ఫుల్‌గా మద్యం సేవించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2,216 మద్యం దుకాణాలు, 1000కిపైగా క్లబ్బుల, బార్లు ఉన్నాయి. 25న దసరా పండుగను జరుపుకోగా 22వ తేదీ నుంచే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. కరోనా ఆందోళనలు ఉన్నప్పటికినీ దసరా నేపథ్యంలో మద్యం విక్రయాలు తెలంగాణలో జోరుగా సాగాయి.











