లాక్ డౌన్ టైమ్ లో కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్న ఆపద్భాంధవుడు సోనుసూద్. కరోనా టైమ్ లో వలస కూలీలను తమ ఇంటికి చేర్చాడు. ఎంతో మంది ఆకలి తీర్చాడు. మనుషుల్లో దేవుడు అంటే అది సోనూసూదే. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా కష్టాల్లో ఉన్నాం అని ఎవరైనా చెబితే చాలు నేనున్నాను అంటూ ముందుకు వచ్చి వారి కష్టాలను చిటికెలో మాయం చేసేవాడు. తెర పై విలన్ గా కనిపించిన సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అయ్యాడు. అయితే.. కరోనా టైమ్ లో చూసిన కష్టాలతో ఈ నటుడు కాస్త రచయితగా మారాడు.
అవును.. సోనూసూద్ రచయితగా మారి ఓ బుక్ రాసారు. ‘ఐయామ్ నో మిస్సియా’ అనే టైటిల్ తో బుక్ రాశారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సెట్ లో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ.. హీరోలుగా పుట్టరు. హీరోలు తయారవుతారు అని సోనూసూద్ మరోసారి నిరూపించారు. అతని జర్నీ ఎంతో మందికి స్పూర్తి కలిగిస్తుంది అని సోనూసూద్ ని అభినందించారు. అంతే కాకుండా చిరంజీవి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలియచేశారు. ఇదిలా ఉంటే.. సోనుసూద్ రాసిన ఈ పుస్తకాన్ని కెబిసి సెట్ లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కి అందచేశారు.
తన మంచితనంతో సోనుసూద్ రియల్ లైఫ్ లో హీరో అయ్యారు. ఇక నుంచి విలన్ పాత్రలు పోషించడం కష్టం అని టాక్ వినిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా చిరంజీవి కూడా ఆచార్య సినిమాలో నిన్ను కొట్టాలంటే చాలా బాధగా ఉంది. నిన్ను సినిమాలో కొడితే.. అది చూసి జనం నన్ను తిట్టుకుంటారు. అందుచేత ఇక నుంచి విలన్ గా చేయకు అని చెప్పారట. ఈ విషయాన్ని సోనుసూద్ బయటపెట్టారు. మరి.. చిరంజీవి చెప్పినట్టుగానే సోనుసూద్ విలన్ గా నటించడం మానేసి హీరోగా చేస్తారేమో చూడాలి.