అలనాటి క్యారక్టర్ ఆరిస్టులలో వై.విజయ ఒకరు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలతో ఆమె ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. అప్పట్లో ఆమె లేని సినిమా ఉండేది కాదు .. అంతగా ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. అప్పట్లో కథ మొత్తం వినేసిన నిర్మాతలు .. వై.విజయ పాత్ర లేకపోతే అసంతృప్తితో పెదవి విరిచేవారట. అప్పటికప్పుడు ఆమె కోసం ఒక పాత్రను క్రియేట్ చేసేవారు. కాస్త కామెడీ .. మరికాస్త రొమాన్స్ టచ్ ఉన్న వందలాది పాత్రల్లో ఆమె మెప్పించారు. ఒకే రోజున ఆమె నాలుగైదు సినిమాల్లో చేసిన సందర్భాలు ఉన్నాయంటే, ఆమె డిమాండ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
తాజా ఇంటర్యూలో వై.విజయ మాట్లాడుతూ తనకి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. “మొదటి నుంచి కూడా నేను సెట్లో సరదాగానే ఉండేదానిని. అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ షూటింగును పూర్తిచేసే వాళ్లం. నన్ను ఎవరూ ఏమీ అనేవారు కాదు. .. నేను కూడా ఎప్పుడూ ఎవరినీ నొప్పించలేదు. ఇప్పటికీ సెట్లో ఉన్నా .. ఏదైనా ఫంక్షన్లో కలిసినా అందరూ నన్ను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. దర్శకులంతా కూడా నన్ను ఎంతో గౌరవిస్తారు. షూటింగుకు ఆలస్యమైతే మాత్రం నాకు కాస్త గిల్ట్ గా .. భయంగా అనిపించేది.
ఒకసారి నేను ఒకే రోజున ఐదు సినిమాలు చేయవలసి వచ్చింది. అయితే ఫ్లైట్ మిస్సైపోవడం వలన నాలుగు సినిమాల షూటింగులకు వెళ్లలేకపోయాను. ఇక రవిరాజా పినిశెట్టి గారి సినిమా అయినా చేద్దామని అనుకున్నాను. అప్పుడు ఆయన ‘కోనసీమ కుర్రాడు’ సినిమా చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో చేయడం అదే మొదటిసారి. ఆయనతో అంతవరకూ పరిచయం లేదు. ఉదయం వెళ్లవలసిన ఆ సినిమా షూటింగుకు మధ్యాహ్నం వెళ్లాను. ఆయన ఏమంటాడోనని చాలా భయపడిపోయాను. “ఈ రోజుకు వద్దులెండి .. రేపు చేద్దాం .. ” అని ఆయన చాలా కూల్ గా అన్నారు. దాంతో నా టెన్షన్ ఎగిరిపోయింది” అంటూ చెప్పుకొచ్చారు.











