కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయకమండలి సీడబ్ల్యూసీ సమావేశం సోమవారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి సారథ్య బాధ్యతలను కొత్తగా ఎవరు తీసుకుంటారు? అనేది తేల్చడమే ఇవాళ పార్టీ సమావేశం ప్రధాన ఎజెండా! పటిష్టమైన, శ్రద్ధగల వారికి నాయకత్వాన్ని అందించాలనే డిమాండ్లు పార్టీ వర్గాల్లో బహుముఖంగా వినిపిస్తుండగా.. సోనియా కుటుంబం గడపదాటిపోకుండా పార్టీ అధికారాన్ని పదిలంగా ఉంచుకోవాలని ఆశ కొందరిలో కనిపిస్తోంది. ఈ భిన్నధృవాలకు, దృక్పథాలకు వేదికగా సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరగబోతోంది.
రాహుల్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినప్పుడు.. ఆయన అంత నిరాసక్తంగా లేరు. ఆ సమయంలో కొన్ని సత్వర నిర్ణయాలను తీసుకున్నారు. తన టీంగా భావించే పలువురికి బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీకి ట్రేడ్ మార్క్ వంటి సీనియర్లు, వృద్ధుల జోలికి ఆయన వెళ్లలేదు గానీ.. పార్టీ నిర్వహణలో తన ముద్ర చూపించేందుకు ప్రయత్నించలేదని అనడానికి వీల్లేదు. ఏకపక్షంగా తాము అధికారంలోకి రాలేకపోయినప్పటికీ.. సంకీర్ణానికి నాయకత్వం వహించే స్థాయిలో సీట్లు సంపాదించి.. కీలకం అవుతామని రాహుల్ లెక్కలు వేసుకున్నారు. కానీ అవేమీ నిజం కాలేదు. పార్టీ దారుణంగా చతికిలపడింది. యూపీఏ కూటమిలోని చిన్న సన్న పార్టీలు కూడా.. వెక్కిరించే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ పార్టీ బాధ్యతలనుంచి విరక్తితో తప్పుకున్నారు.
అప్పటికప్పుడు పార్టీకి గతిలేనట్టుగా సోనియా చేతుల్లో పెట్టారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా ఆమె అభిషిక్తమయ్యారు. తాజాగా ఆ బరువను కూడా దించుకోనున్నట్టు ప్రకటించారు. అందుకే కొత్త నేత ఎంపిక కోసం ఇప్పటి భేటీ.
రాహుల్కు ఆశ లేదా?
రాహుల్కు అధ్యక్ష పదవిపై ఆశ లేదని అనడానికి, అనుకోడానికి వీల్లేదు. ఎందుకంటే, గతంలో ఆయన జమానాలో నియుక్తులైన చాలా మంది.. ఇప్పుడు తిరిగి పార్టీకి రాహుల్ నాయకత్వమే కావాలంటూ లేఖలు రాస్తున్నారు. తాను అడగకుండా.. తన వారితో అడిగించడం అనేది రాహుల్ వ్యూహం కావొచ్చు. గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వయస్సు మళ్లిన వాళ్లందరినీ పక్కకు తప్పించే విషయంలో తనకు పూర్తి నిర్ణయాధికారం లేకుండా పోయిందని రాహుల్ అలిగినట్టుగా అప్పట్లో వినిపించింది. అది సబబు కూడా కావొచ్చు. కొన్ని దశాబ్దాలుగా ఒకే తరహా పనికి అలవాటు పడిపోయిన వారు.. రాహుల్ చెప్పే నవీన రాజకీయ వ్యూహాలకు ఒక పట్టాన తలొగ్గుతారని అనుకోలేం. అందుకే.. ఆయన అలిగి ఉండొచ్చు. ఇప్పుడు- తాను అడిగినట్టు గాకుండా.. అందరివైపు నుంచి వచ్చే విజ్ఞప్తుల రూపేణా తన చేతికి అధికారం వస్తే.. పూర్తి నిర్ణయాధికారం తన చేతి లో ఉంచితే తప్ప.. పగ్గాలు అందుకోనని ఆయన పట్టుపట్టవచ్చు. అదే జరిగితే గనుక.. రాహుల్ కొత్త సారథి అయితే అనతికాలంలోనే.. వయస్సుమళ్లిన సీనియర్లంతా పార్టీ పదవులను కూడా మరచిపోక తప్పదు.
మరోవైపు సోనియా కుటుంబ భక్తబృందం దేశవ్యాప్తంగా పుష్కలంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల విషయానికే వస్తే.. వీరభక్త హనుమంతరావు లాంటి వాళ్లు.. సోనియా కుటుంబం నుంచి సారథ్యం పక్కకు పోవడానికి వీల్లేదని అంటున్నారు. కేవలం యూత్ భావజాలం దృష్టితో వంశీచంద్ రెడ్డి లాంటి వాళ్లు కూడా రాహుల్ నాయకత్వాన్నే సమర్థిస్తున్నారు.
పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు?
ఒకసారి పదవిలో కూర్చోబెడితే.. ఓడిపోయిన వెంటనే.. కాడి పక్కన పారేసిన నాయకుడిని నమ్ముకుంటే.. ఎంతకాలం ముందుకు పోగలం అనే భయం పార్టీలో మెజారిటీ సీనియర్లలో ఉంది. సోనియా కుటుంబ భక్తితో నిమిత్తం లేకుండా పార్టీని, కాంగ్రెస్ రాజకీయాలను మాత్రమే ఆకళింపు చేసుకున్న వారు.. సోనియా కుటుంబం షాడోలోంచి.. పార్టీని బయటకు తీసుకురావడానికి తపన పడుతున్నారనడంలో సందేహం లేదు.
అయితే ఇదే సమయంలో ఇందుకు అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి. అనేక కారణాల రీత్యా.. సోనియా కుటుంబాన్ని సమర్థించే వారు కూడా పార్టీలో అంతే సంఖ్యలో ఉన్నారు. ఎట్లీస్ట్ బహిరంగంగా వారు సోనియా కుటుంబానికి వ్యతిరేకంగా పల్లెత్తు మాట కూడా అనరు. ఈ రెండు వర్గాల మధ్య సంక్లిష్ట పోరుగా ఇవాళ్టి సీడబ్ల్యూసీ భేటీ ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎన్నికలు సాధ్యమేనా?
రాహుల్ నాయకత్వం పట్ల విముఖత, ఆయనలోని విరక్తి పట్ల ఆగ్రహం ఉన్న నాయకులు పార్టీకి కిందిస్థాయి నుంచి, పార్టీ జాతీయ అధ్యక్ష స్థానం వరకు సంస్థాగతంగా ఎన్నికలు జరగడం ఒక్కటే మంచి దారి అని అంటున్నారు. ‘రాహుల్ వద్దు’అని నేరుగా అనలేని వారి వాదన ఇది. అయితే.. సోనియా కుటుంబానికి భజన చేయడంలోనే ఐహిక పారమార్థిక ఆశయాలను కలిగి ఉండే వారు కొల్లలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. ఎన్నికలు జరుగుతాయా? అది సాధ్యమేనా? అనే సందేహం పలువురిలో ఉంది.
గతంలో ఎన్నికలు అనే లాంఛనం జరిగిన ప్రతి సందర్భంలోనూ.. అది మొక్కుబడి తంతుగానే నిరూపణ అయింది. సోనియా అనుగ్రహ పాత్రులు తప్ప, ఆ కుటుంబానికి బయటివాళ్లు ఎవ్వరూ ఆ పదవిలో కూర్చోలేదు. ఇలాంటి నేపథ్యంలో.. పారదర్శక ఎన్నికలు అసలు సాధ్యమేనా? అనేది కూడా చర్చనీయాంశమే.
సోనియాకు స్వయంగా పార్టీ నిర్వహణ చూసే వెసులుబాటు లేదు. వయోభారం కూడా ఇబ్బందే. అందుకే ఆమె తెగేసి నో అనేశారు. ఆమె మనసులో కుమారుడికే పట్టాభిషేకం జరగాలని ఉండొచ్చు. కానీ.. కుమారుడు ఇంకా ఎస్ అనడం లేదు. తాను ఎస్ అనకుండానే.. కిరీటం వచ్చి తన శిరస్సును అలంకరించాలనేది ఆయన ఆలోచన. అందుకు అనుకూలంగా పావులు కదపడానికి, అవసరమైతే చక్రం తిప్పడానికి సోదరి ప్రియాంక వాధ్రా కూడా ఆల్రెడీ హస్తినకు చేరుకున్నారు. సీడబ్ల్యూసీ సమావేశం జరిగేది ఆన్లైన్ మీటింగ్ పద్ధతిలోే అయినప్పటికీ.. వ్యూహాలకు మంతనాలకు కొదువ ఉండకపోవచచు. రాహుల్ ఎదురుచూపులు ఫలిస్తాయో. ఒక కుటుంబ ప్రయోజనాల్ని కోరుకునే, సోనియా ప్రీత్యర్థం తమ మాటలను మలుచుకునే నాయకులు ఉండగా కాంగ్రెస్ పరిణామాలు ఎలా మారుతాయో.. ఆ పార్టీ భవిష్యత్ తలరాతను అవి ఎలా నిర్దేశిస్తాయో ఇవాళ తేలుతుంది.