జగన్ రెడ్డి తన పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు.. నేతలు, కార్యకర్తలలో పోయిన విశ్వాసాన్ని మళ్లీ పొందేందుకు తెగ తంటాలు పడుతున్నారు. కానీ, ఇందుకు ఒక సక్రమమైన మార్గాన్ని ఎంచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ప్రజల్లోకి వెళ్లడం.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లాంటి వాటి జోలికి వెళ్లడం లేదు. చక్కగా ప్యాలెస్ లలో ఎంజాయ్ చేస్తూ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా అడ్డదారి తొక్కాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారు.
అందుకు ఉన్న ఏకైక మార్గం సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ద్వారానే గతంలో వైఎస్ఆర్ సీపీ ప్రతిష్ఠ మసకబారింది. జగన్ పార్టీలో నాయకులు, పార్టీ సీనియర్ లీడర్లు అసహనంతో ఉండగా.. సామాజికవర్గాలకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం కూడా దారుణంగా ఉంది. పైగా జగన్ సొంత ఫ్యామిలీ రిలేషన్స్ బాగా దెబ్బతిన్నాయి. అయితే, ముందు వాటిని సరిదిద్దుకోకుండా జగన్ రెడ్డి సోషల్ మీడియా మీద పట్డారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా క్రియాశీల బాధ్యతలను సరైన వ్యక్తి చేతుల్లో ఉంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆ బాధ్యతలు సజ్జల భార్గవ్ రెడ్డి చేతుల్లో ఉండగా.. ఎంత నష్టం వాటిల్లిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు సోషల్ మీడియా విభాగాన్ని ప్రక్షాళన చేసే దిశగా జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో విడదల రజిని పేరును పార్టీ నేతలు తెరపైకి తెచ్చారు. ఆమె చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన వ్యక్తిగత సోషల్ మీడియా విషయంలో తన సత్తా చాటుకున్నారు. దీంతో చాలా మంది ఆమెకు ఓట్లు వేశారు. ఆమె తన సొంత ప్రొజెక్షన్ కోసం సోషల్ మీడియాను చక్కగా నిర్వహించిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లోనైనా తనపై ప్రతికూల ప్రచారాలను ఎదుర్కోవడానికి అనేక సోషల్ మీడియా ఉపాయాలను విడదల రజిని అమలు చేసిందని అంటున్నారు.
ఆమె సామర్థ్యాన్ని పార్టీ నేతలు జగన్ కంట్లో పడేసినట్లు టాక్. కాబట్టి, సోషల్ మీడియా నిర్వహణ బాధ్యతను రజినికి అప్పగిస్తారని అంటున్నారు. సోషల్ మీడియాకు నాయకత్వం వహించడానికి వచ్చిన కొత్త వారు పార్టీ పట్ల ఎలాంటి సెంటిమెంట్‌ను కలిగి ఉండరని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అభిరుచి కలిగిన నేతను ఎంపిక చేయాలని చూస్తున్నారు. కాబట్టే, సోషల్ మీడియా బాధ్యతను విడదల రజిని చేతుల్లో పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారట. మరి జగన్ మోహన్ రెడ్డి విడదల రజినికే ఓటేస్తారా అనేది ఆసక్తిగా మారింది.