జగన్ ప్రభుత్వంలో గుట్టు చప్పుడు కాకుండా జరిగిన అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం పరిపాలనా పరమైన అక్రమాలే కాదు.. నిస్సిగ్గుగా చేసిన దుర్మార్గపు వ్యవహారాలన్నీ ఇప్పుడు తేలుతున్నాయి. ముంబయికి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న వైసీపీ లీడర్ అరాచకం తాజాగా వెలుగు చూసింది. కృష్ణా జిల్లాకు చెందిన ఈ లీడర్ ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించడమేకాక.. తన అధికార బలంతో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు. అలా బెదిరించి, భయపెట్టి పెళ్లి మాటే ఎత్తకుండా బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రదారులు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయవాడ సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ వైపే చూపిస్తున్నాయి.
సినీ నటిని వదిలించుకునేందుకు సజ్జల సాయం చేసినట్లుగా చెబుతున్నారు. మోసం చేసిన వ్యక్తి.. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్ కుక్కల నాగేశ్వరరావు కుమారుడు, 2014లో వైసీపీ తరఫున పెనమలూరు నుంచి పోటీ చేసిన కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పెళ్లిలో సినీ నటితో పరిచయం పెంచుకున్నాడు. అలా ఏళ్ల తరబడి సన్నిహితంగా మెలిగి.. పెళ్లి మాటెత్తగా విద్యాసాగర్ ముఖం చాటేశాడు. గత జనవరిలో ఒత్తిడి మరింత పెరగడం.. ఎలక్షన్ల వేళ ఈ రచ్చ బయటపడితే పార్టీకి బాగా నష్టం వస్తుందని.. తమ అధికార బలం ప్రయోగించారు. సజ్జలని కలవగా.. ఆయన ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా రంగంలోకి దిగారు.
అసలే కాంతిరాణా జగన్‌తో అంటకాగుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. ఒక విద్యాసాగర్ నుంచి సీపీ ఫిర్యాదు అందుకొని ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, బెదిరింపు తదితర సెక్షన్ల కింద సినీనటిపై, ఫ్యామిలీపై కేసులు పెట్టారు. అప్పట్లో విజయవాడ డీసీపీగా పని చేసిన విశాల్ గున్ని సహా ఓ బృందాన్ని విమానంలో ముంబయికి పంపించి.. సినీనటిని, ఆమె తల్లిదండ్రుల్ని ఈ కేసులో అరెస్టు చేయడం.. అక్కడి కోర్టులో హాజరుపరిచి విజయవాడకు తీసుకురావడం జరిగాయి. పెళ్లి మాటెత్తితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ లు ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబం సైలెంట్ గా ముంబయికి వెళ్లిపోయింది. ఫిబ్రవరిలో జరిగిన ఈ వ్యవహారం ఆర్నెల్ల తర్వాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
అయితే, ఈ వ్యవహారంలో మరో వాదన కూడా ఉంది. దేశంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఒకరు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఈ సినీనటి కొన్నాళ్ల కిందట ముంబయిలో ఓ కేసు పెట్టారు. ఈ విషయాన్ని ముంబయిలో సెటిల్ చేస్తే తన పరువు పోతుందని భావించి.. తన పరిచయాలతో అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో వారి సాయం కోరినట్లు మరో వాదన కూడా ఉంది. అలా విద్యాసాగర్ వ్యవహారాన్ని ముందుపెట్టి కథ నడిపించారని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది.