కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అంటేనే.. ఓ రేంజి దూకుడుతో సాగుతున్న పార్టీగా గుర్తింపు ఉంది. నరేంద్ర మోదీ వచ్చాక ఆ దూకుడు మరింతగానే పెరిగిందని చెప్పాలి. ఇక ఆ పార్టీ తెలంగాణ శాఖకు బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక.. తెలంగాణలో కేసీఆర్ సర్కారును గద్దె దించేదాకా విశ్రమించేది లేదన్నట్లుగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఓ రేంజి ప్రకటనలు చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర సందర్భంగా బీజేపీలో సరికొత్త ఉత్సాహం కనిపించింది. శుక్రవారం నాడు వరంగల్ లో కిషన్ రెడ్డి చేపట్టిన యాత్రలో పాలుపంచుకున్న బీజేపీ కీలక నేత మురళీధర రావు సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాలిబాన్ ఉగ్రవాదుల మద్దతుదారులున్నారని, రాజకీయ నేతల్లోనూ కొందరు తాలిబాన్ సపోర్టర్లు ఉన్నారని.. వారు టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంతకీ ఏమన్నారంటే..?
కిషన్ రెడ్డి యాత్ర సందర్భంగా మురళీధర రావు.. కేసీఆర్ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తోంది. ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉంది. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో.. ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది. యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయి. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. 2019 నాటికి 2.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలి. కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయి. కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారు’’ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాలిబాన్ వ్యాఖ్యలు ఎవరిపై..?
మురళీధర రావు నోట తాలిబాన్ మద్దతుదారులు, ఆ ఉగ్రవాద సంస్థకు మద్దతు పలుకుతున్న రాజకీయ నాయకులు అన్న వ్యాఖ్యలు వచ్చినంతనే.. మజ్లిస్ పార్టీని టార్గెట్ చేసే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపించాయి. టీఆర్ఎస్ తో మజ్లిస్ పార్టీ మైత్రితోనే సాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మజ్లిస్ నేతలు అడిగిన ప్రతి పనినీ కేసీఆర్ సర్కారు క్షణాల్లోనే చేసి పెడుతోందన్న వానదలూ లేకపోలేదు. ఇటీవల మజ్లిస్ పార్టీ హిందూత్వపై ఓ రేంజిలో దూకుడు చూపిస్తోన్న నేపథ్యంలోనే.. టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూనే మురళీధర రావు మజ్లిస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై ఇటు టీఆర్ఎస్ నుంచి గానీ.. అటు మజ్లిస్ పార్టీ నుంచి గానీ ఎలాంటి స్పందన వస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది.
Must Read ;- వైసీపీ కాదుగా.. కేంద్ర మంత్రి అయితే ఏంటీ?