MAA Elections At The End Of September :
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై స్పష్టత వచ్చేసింది. సెప్టెంబరు నెలాఖరులో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. నిన్న ఈ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం రెండు సార్లు జరిగింది. వర్చువల్ గా ఈ సమావేశం నిర్వహించారు. మొదటి సమావేశానికి వీకే నరేశ్, రెండో సమావేశానికి జీవితా రాజశేఖర్ అధ్యక్షత వహించారు. ఇందులో ప్రధాన అజెండా ఎన్నికల నిర్వహణ. సమావేశంలో 150 మంది పాల్గొన్నారు. కొందరు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని పట్టుబట్టగా, మరి కొందరు కమిటీ నిర్ణయానికే వదిలేశారు.
క్రమశిక్షణ సంఘం సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకుందామని నరేశ్ తెలిపారు. సెప్టెంబరు 21న ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ప్రకాష్ రాజ్ కోరారు. దీనిపై క్రమశిక్షణ సంఘం కూడా స్పందించింది. వారం రోజుల్లో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని కృష్ణంరాజు, మురళీ మోహన్ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అనుమతి కూడా తీసుకోవాలి కాబట్టి సెప్టెంబరు రెండో వారం తర్వాత ఎన్నికలు ఉండేలా చూస్తామని మురళీ మోహన్ వెల్లడించారు.
సెప్టెంబరు 12 లేదా సెప్టెంబరు 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. అయితే అదే సమయంలో గణేశ్ ఉత్సవాలు ఉంటాయి. అందువల్ల ఎన్నికలకు తేదీ సెప్టెంబరు 26న ఉండొచ్చు. గత కొంత కాలంగా మా ఎన్నికల నిర్వహణ రచ్చగా మారింది. ఇలా ఏదో ఒక రకంగా చర్చల్లో నలుగుతోంది. ఇది నటీనటుల సంఘం అంతర్గత వ్యవహారం కాబట్టి మీడియాలో రచ్చ చేయడం అనవసరం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయినా మీడియా కూడా దీనిపట్ల అత్యుత్సాహ చూపుతోంది. ఎన్నికలకు ఇంకా దాదాపు నెల రోజుల వ్యవధి ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
Must Read ;- మా భవనం కోసం స్థలం చూసి.. మరోసారి వార్తల్లో నిలిచిన విష్ణు.