Terrible Conditions Prevailed In Afghanistan :
నరహంతక తాలిబాన్ ఉగ్రవాదులు చెరబట్టిన ఆఫ్ఘనిస్తాన్ లో భయానక వాతావరణం నెలకొంది. తాలిబాన్ ఉగ్రవాదుల దాడితో భీతిల్లిపోయిన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏకంగా దేశాన్ని వదిలి పరారయ్యారు. ఈ నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటంటూ ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు కూడా క్షణమొక యుగంలా కాలం వెళ్లదీస్తున్నారు. ఆఫ్ఘన్ వాసులు ఎలాగోలా.. ఎక్కడో ఒక చోట తలదాచుకునే దిశగా కదులుతుంటే.. విదేశీయులు మాత్రం ఏమాత్రం అవకాశం చిక్కినా తమ స్వదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏ వాహనం అందింతే దానిలోనే ఆఫ్ఘన్ బయటకు వెళ్లేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదు.
ఎయిర్ పోర్టులు బస్టాండ్లయ్యాయి
ఇలా ఉగ్రవాదుల చెరబట్టిన ఆఫ్ఘన్ నుంచి తమ దేశాలకు తరలివెళ్లే క్రమంలో విదేశీయులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయాలకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశ రాజధాని కాబూల్ విమానాశ్రయం అయితే పండుగల వేళ మన బస్టాండ్లు జనంతో ఎలా కిటకిటలాడతాయో.. ఆ మాదిరిగా కాబూల్ విమానాశ్రయం మారిపోయింది. పాస్ పోర్టులు లేవు.. వీసాల్లేవు.. అసలు వాటిని అడిగే నాథుడే లేకుండాపోయాడు. దీంతో కనీసం తమ దేశాలకు ప్రయాణించేందుకు అవసరమైన సొమ్మును కూడా చూసుకోకుండానే కాబూల్ విమానాశ్రయానికి జనం పోటెత్తుతున్నారు.
రెక్కలపైకి ఎక్కి.. ప్రాణాలొదిలి..
తమ దేశానికి చెందిన విమానాలు వస్తాయని, తమను సురక్షితంగా అక్కడి నుంచి తీసుకుపోతాయని గంటల తరబడి వేచి చూస్తున్న విదేశీయులు.. సోమవారం ఉదయం కాబూల్ విమానాశ్రయానికి వచ్చిన ఓ ఎయిర్ బస్ ను ఎక్కేందుకు ఎగబడ్డారు. విమానం ల్యాండ్ అవుతుండగానే.. దానిని పట్టుకుని ఎక్కేందుకు దాని వెంటే పరుగులు పెట్టారు. విమానం కింద పడి నలిగిపోతామన్న భయం కూడా వారిలో కనిపించలేదు. ఈ క్రమంలో విమానం లోపలి భాగమంతా నిండిపోవడంతో స్థలం దొరకని కొందరు ఏకంగా విమానం రెక్కలపైకి ఎక్కారు. జనం నిండగానే ఆ ఎయిర్ బస్ గాల్లోకి ఎగరగా..రెక్కలపైకి ఎక్కిన వారిలో కొందరు పట్టు తప్పి కింద పడిపోయారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. ఎయిర్ బస్ ను ఎక్కేందుకు దాని వెంట పరుగులు తీస్తున్న జనం.. విమానం రెక్కల పై నుంచి కింద పడిపోతున్న వారి దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారిపోగా.. ప్రస్తుతం ఆఫ్ఘన్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆ దృశ్యాలు చెబుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.