దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైపోయింది. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన హుజూరాబాద్, బద్వేల్ స్థానాల కౌంటింగ్‌పై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కండబలం చూపుతూ వైసీపీ సాగిన నేపథ్యంలో బద్వేల్‌లో ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుధ విజయం దాదాపుగా ఖరారైపోయిందనే చెప్పాలి. అదే సమయంలో హుజూరాబాద్‌లో కూడా వన్ సైడెడ్‌గానే పోలింగ్ జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఒకింత ఆధిక్యం లభించినా.. తొలి రౌండ్ నుంచి ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌కు షాకిస్తూ బీజేపీ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యం సాధిస్తూ సాగుతున్నారు. వెరసి చివరి వరకు ఇదే తరహా ఫలితాలు ఖాయమని, ఈటల గెలుపు కూడా ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కమలనాథుల్లో జోష్..
ఉప ఎన్నికల కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి బీజేపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలెట్‌ను వారు అంతగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే తొలి రౌండ్ గెల్లుపై ఈటలకు 166 ఓట్ల మేర ఆధిక్యం లభించడం, అది కూడా టీఆర్ఎస్‌కు పట్టున్న హుజూరాబాద్ మండలంలో ఇలా ఆధిక్యం రావడంతో గులాదీ దళం షాక్ కు గురైందని చెప్పక తప్పదు. అదే సమయంలో తొలి రౌండ్‌లోనే తమకు ఆధిక్యం లభించడంతో కమలనాథులు ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. తొలి రౌండ్ తో పాటు రెండు, మూడు, నాలుగో రౌండ్లలోనూ ఈటలకే ఆధిక్యం లభించింది. అంతేకాకుండా రౌండ్ రౌండ్‌కు బీజేపీకి దక్కుతున్న ఆధిక్యం కూడా పెరుగుతూ పోతోంది. తొలి రౌండ్లో 166 ఓట్ల ఆధిక్యం కాగా.. నాలుగో రౌండ్ పూర్తి అయ్యే సరికి ఈటలకు 1835 ఓట్ల మేర ఆధిక్యం లభించింది. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఉదయం 11.30 గంటల సమయానికి నాలుగు రౌండ్లు పూర్తి అయ్యాయి. ట్రెండ్ చూస్తుంటే.. హుజూరాబాద్‌లో బీజేపీ విజయం సాధించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బద్వేల్‌లో ఏకపక్షమే
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప జిల్లాలోని బద్వేల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలింగ్ మొత్తం ఏకపక్షంగానే సాగిందన్న వాదనలు వినిపించాయి. ఈ వాదనలు నిజమేనన్న రీతిలో మంగళవారం నాటి ఓట్ల లెక్కింపులో ప్రారంభం నుంచి వైసీపీ అభ్యర్థి సుధ స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ సహా తొలి రౌండ్ నుంచి కూడా ఆమె విస్పష్ట మెజారిటీతోనే సాగుతున్నారు. ఉదయం 11.30 గంటల సమయానికి 8 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా. బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్‌పై వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ.. ఏకంగా 70 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యం సాధించేశారు. ఈ క్రమంలో వైసీపీ అనుకున్నట్లుగానే ఈ ఎన్నికల్లో డాక్టర్ సుధ లక్ష పై చిలుకు ఓట్లతో విజయం సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.