684 రోజులపాటు రాజధానికి భూములిచ్చిన రైతులు తుళ్లూరు వేదికగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. నిరసనలు, ఆందోళనల నడుమ తమ గోడును తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి విన్నవించాలని ‘న్యాయంస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచణ సమితి ఆధ్వర్యంలో మహాపాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర సోమవారం తుళ్లూరు వేదికగా ప్రత్యేక పూజలు నిర్వహించి వేంకటేశ్వరస్వామి, న్యాయదేవత విగ్రహాలను వాహనంపై ఆశీనింపజేసి పాదయాత్ర ప్రారంభించారు. 45 రోజుల పాదయాత్ర షెడ్యూల్లో భాగంగా నాలుగు జిల్లాలలోని 75 గ్రామాలను చుడుతూ మహాపాదయాత్ర ముందుకు సాగుతోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదిగా సాగే పాదయాత్రకు రోజురోజుకు ప్రజా మద్దతు పూర్తి లభిస్తోందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతి అవశ్యకత, భావితరాల భవితను కాంక్షించి తామిచ్చిన భూములు, 684 రోజులుగా చేస్తున్న నిరసన దీక్షలు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోయి భాగస్వాములను చేయాలని జేఏసీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తలపెట్టిన పాదయాత్రను అడ్డుపడేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. న్యాయంస్థానం షరతులతో కూడిన అనుమతులతో పాదయాత్రకు అడుగులు పడ్డాయి. మహాపాదయాత్రకు వైఎస్సార్సీపీ మినాహ అన్నిరాజకీయ పార్టీలు సంపూర్ణమద్దతునిచ్చాయి. ప్రజా సంఘాలు, సామాజీక కార్యకర్తలు, ఏక రాజధాని మద్దతుదారులు పెద్దఎత్తున మహాపాదయాత్రలో రైతులతో జతకట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు, ప్రజాసంఘాలు సంఘీభావం తెలిపి, ప్రభుత్వ వైఖరిపై తమదైన శైలిలో తిట్టిపోశారు. మద్దతుదారులతో జనసందోహంలా మారిన ఆ పాదయాత్రను తిలకిస్తే.. అధికారపార్టీకి సూక్ష్మంలో మోక్షం బోధపడినట్లైంది. పాదయాత్రకు అన్నిరాజకీయ పార్టీలు ఏకమై ఏక రాజధాని కోసం నినదించిన వేళ.. అధికార పార్టీ ఒక్కటే ఏకాకిలా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఆకుపచ్చని రైతు జెండాకు అఖిలపక్షం ఏజెండా కూడా తోడవ్వడంతో మహాపాదయాత్రకు మరింత బలం చేకూరింది.
తొక్కాలని చూస్తే .. బంతిలా లేచిందిగా!
రాజధానిని అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న అనేక ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలను తొక్కాలని జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక ఎత్తులు వేసిందనే చెప్పవచ్చు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు, రైతులు, జేఏసీ నాయకులపై ఆఖరికి మీడియాపై కూడా పోలీసు బలగాలు జరిపిన దాడులు ఇంకా గుర్తే ఉన్నాయి. రైతుల వీపులపై లాఠీ చేసిన గాయాలు ఇంకా మాయను లేదు. ఈ దాడులు, కుట్రలను సమర్ధవంతంగా ఎదుర్కొంది రైతు సంకల్పం. ఎక్కడా అధికారపార్టీ చేస్తున్న దాడులకు వెరవక మొక్కవొని దీక్ష పూనింది. రైతులు నేడు తలపెట్టిన పాదయాత్ర ఒక మైలురాయనే చెప్పుకొవచ్చు. ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో అనుమతివ్వదని గ్రహించి, ప్రొసిజర్ ప్రకారం అనుమతులకు వినతులు పెట్టారు. ఎన్నిరోజులైనా డీజీపీ కార్యాలయం అంగీకారం తెలపకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ తెప్పించుకున్నారు. సరిగ్గా 684 రోజులకు ముందు అనగా డిసెంబర్ 17, 2019 న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయం, ఆ తరువాత పరిణామక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తాయి. సీన్ కట్ చేస్తే నాటి నుంచి నేటి వరకు రైతుల ఉద్యమం నివురగప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది. అయితే రైతు ఉద్యమాన్ని 13 జిల్లాల నుంచి ఒక గుంటూరు జిల్లాకు, తరువాత 29 గ్రామాలకే పరిమితం చేశామని సంబరపడింది అధికార పార్టీ. ఆ తరువాత 29 గ్రామాల నుంచి కేవలం ఒక గ్రామానికే ఉద్యమాన్ని తీసుకొచ్చామని చంకలు గుద్దుకుంది. ఆ భ్రమల నుంచే బాటలు వేసుకుంటూ అకుంఠిత దీక్షతో రైతులు నేడు మహాపాదయాత్రగా మలిచారు. ఆ పాదయాత్రే నేడు రాష్ట్రం వ్యాప్తంగా దావాలనంలా రాజుకుంటుందని. రైతులు చేస్తున్న ఉద్యమంలో నిజాయితీ, ఆశయం, సంకల్పబలం దృఢంగా ఉంది కాబట్టి తొక్కాలని చూసిన ఉద్యమం బంతిమాదిరిగా లేచింది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ గ్రామానికే పరిమితమైంది అనుకున్న ఉద్యమం నేడు మహాపాదయాత్రగా అన్ని జిల్లాలకు వ్యాపింపజేయడంలో జేఏసీ విజయం సాధించింది. అంతేకాక అధికార పార్టీకి దిమ్మతిరిగేలా షాకిచ్చింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టుకోవడమే కాదు జన జాగృతికి కూడా ఈ మహాపాదయాత్ర దోహదపడుతోందని అఖిలపక్ష నేతలతోపాటు జేఏసీ భావిస్తోంది.
ఏ ఉద్యమమైనా రాజీతోనే చల్లారుతోంది ..!
ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రజా ఉద్యమైన ప్రభుత్వాధినేతల కాంప్రమైజింగ్ విధానంతోనే చల్లారుతోందని చరిత్ర చెబుతోంది. ఈ ఇంగితాన్ని జగన్మోహన్ రెడ్డి మరిచారు. అధికారం చేతులో ఉంది .. ఏ శాసనం చేసినా.. అది చెల్లుబాటౌతోంది అనుకుంటే పొరబటే. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు ప్రకటిత శాసనాధిపతులు మాత్రమే, పాలనాధికారానికి విసృంఖులుగా వాడితే అదికాసా.. ప్రజాస్వామ్యానికి న్యాయస్థానం అనేక ఒక వ్యవస్థ ఉందని గుర్తుచేస్తోంది. రాచరిక వ్యవస్థలో సాధ్యమైనవి ప్రజాస్వామ్యలో అసాధ్యపడదన్న క్లారిటీ కూడా లేకుండా పాలన సాగిస్తే ప్రజాస్వామ్యం చూస్తూ ఊరుకోదు, అందుకు ఉదాహరణే నేడు ఏపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. విచక్షణను మరిచి శాసనాలు చేస్తే .. న్యాయస్థానాలు వేసే మొట్టికాయలు, చెంపదెబ్బలను రుచి ఏపాటిదో ఇప్పటికైనా అధికారపార్టీ గుర్తిస్తే మంచిదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తమౌతున్నాయి. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు, తొక్కాలనే రాజకీయ కుయుక్తులు అన్ని తాత్కలికమేనని రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం రుజువు చేసింది. అంతిమంగా తుళ్లూరు మీ ఏలుబడిలోని ఒక ప్రాంతమని గుర్తించండి. అక్కడ రైతులు చేస్తున్న ఉద్యమాలను ఇప్పటికైనా గమనంలోకి తీసుకొండి. అది పాకిస్థాన్ కాదు .. అత్యధిక ప్రజలు ఆకాంక్షించేది ఏపి రాజధాని అమరావతి అని పలువురు మేధావులు రైతుల మహా పాదయాత్ర ద్వారా సూచిస్తున్నారు.