స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టుకు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కాగానే బీజేపీ అధిష్ఠానంలో అనూహ్యమైన మార్పు కనబడుతోంది. ఇన్నాళ్లు బీజేపీ కేంద్ర పెద్దలు చంద్రబాబు అరెస్టును ఖండించకుండా, కనీసం మాట్లాడకుండా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, నవంబరు 20న చంద్రబాబుకు బెయిల్ రాగానే రూటు మార్చారు. చంద్రబాబు అరెస్టుని ఖండించారు. ఇన్నాళ్లు మిన్నకుండి ఇప్పుడు బెయిల్ రాగానే అరెస్టును ఖండించడం పట్ల చర్చ జరుగుతోంది. సోమవారం ఒంగోలులో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో రెండు వర్గాలుగా బీజేపీ
ఇంత వరకూ ఏపీ బీజేపీ విభాగం మాత్రమే చంద్రబాబు అరెస్టును తప్పుబడుతూ వచ్చింది. కేంద్ర పెద్దలు మాత్రం ఏ ప్రకటనా చేయలేదు. తాజాగా ఈ తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ బీజేపీ ఇటీవల రెండుగా చీలిపోయింది. ఈ రెండు వర్గాల్లో ఓ వర్గం టీడీపీకి అనుకూలంగా ఉండగా, మరో వర్గం వైఎస్ఆర్ సీపీకి ప్రోగా ఉంటోంది. ఈ రెండో వర్గానికి ఎంపీ విజయసాయి రెడ్డి అనధికార అధ్యక్షత వహిస్తున్నారు. అందుకే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రభుత్వంపై ఏ విమర్శలు చేసినా.. రెండో వర్గం తరపున విజయసాయి రెడ్డి ఈ మధ్య తరచూ స్పందిస్తున్నారు. పురంధేశ్వరిపై సెటైర్లు వేస్తున్నారు. పురందేశ్వరి వైపు ఉన్న మరో వర్గం ప్రో టీడీపీ వర్గంగా చెబుతున్నారు. అంటే, ఏపీ బీజేపీలో అసలు బీజేపీ వర్గ నేతలే లేరన్నమాట! టీడీపీ, వైఎస్ఆర్ సీపీకి మద్దతు పలికే వర్గాలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ బీజేపీ విభాగాన్ని గాడిలో పెట్టి, హైకమాండ్ భావజాలం, ఆలోచనలు వివరించేందుకు బీఎల్ సంతోష్ వచ్చినట్లుగా భావిస్తున్నారు. అందులో భాగంగానే చంద్రబాబు అరెస్టుపై తాజా తీర్మానం చేశారని భావిస్తున్నారు.
ఇటు తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన – బీజేపీ పొత్తు ఉంది. ఏపీలో మాత్రం జనసేన, టీడీపీ కలిసి ముందుకు వెళ్తున్నాయి. బీజేపీ – జనసేన పొత్తు కొనసాగుతూనే ఉంది. కానీ, బీజేపీ జనసేన – టీడీపీతో కలవడంలో మాత్రం వెనకాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రాజకీయవ్యూహం ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన పార్టీ బీజేపీని కూడా కలుపుకోవాలంటే, తాము వైఎస్ఆర్ సీపీకి చాలా దూరం అని చాటుకోవాల్సి ఉంటుంది. అలా చేయాలంటే వైఎస్ఆర్ సీపీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలి. ఏపీలో బీజేపీకి, బీజేపీ అగ్రనాయకులకు జగన్ రెడ్డి అంటేనే అభిమానమనే అభిప్రాయం జనాల్లో ఉంది. అందుకే వైసీపీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అందులో భాగంగానే బీజేపీ తాజాగా చంద్రబాబు అరెస్టు విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది.











