దాదాపు రూ.కోటి హవాలా డబ్బును పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అయితే ఈ ఘటనలో మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై వస్తున్న ఆరోపణలపై వివేక్ బహిరంగ లేఖను విడుదల చేశారు. తనకు ఏమాత్రం సంబంధంలేని ఒక బిజినెస్ లావాదేవీల వ్యవహారంలో హైదరాబాద్ సీపీ తన పేరు లాగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దుబ్బాకలో టీఆర్ఎస్ దారుణమైన ఓటమిని చూడబోతుందనే విషయాన్ని సీఎం గ్రహించి బీజేపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివేక్ విమర్శిస్తూ బహిరంగ లేఖను విడుల చేశారు. తనపై కావాలనే వ్యక్తిగతమైన కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రగతి భవన్‌పై దాడులు చేయండి…
విశాఖ ఇండ్రస్ట్రీ నుంచి ఆ డబ్బులు వచ్చినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హవాలా డబ్బును తరలిస్తున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బందువును, కారును, కారు డ్రైవర్‌ను నిన్ననే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఇందులో వివేక్ పేరు ప్రధానంగా తెరమీదకు రావడంతో ఈమేరకు ఆయన వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. దుబ్బాక ఎన్నికల కోసం పోలీసులను అధికార పార్టీ వాడుకుంటున్నదని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు చేసినటప్పటికినీ దుబ్బాకలో బీజేపీ గెలుపు మాత్రం ఖాయమన్నారు. నిజంగా దుబ్బాకలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే, దమ్ముంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌పై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయాలన్నారు. ఓటర్లను పంచేందుకు డబ్బులన్నీ అక్కడి నుంచే టీఆర్ఎస్ పార్టీ పంపిస్తోందన్నది బహిరంగ రహస్యమని లేఖలో తెలిపారు.
సీపీ కామెంట్స్…
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. నిన్న పట్టుబడిన హవాలా సొమ్ముకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్‌లలో కీలక సమాచారం ఉందని తెలిపారు. ఈ నగదును విశాఖ ఇండస్ట్రీ నుంచి దుబ్బాకకు తీసుకెళుతున్నట్లు గుర్తించామని సీపీ పేర్కొన్నారు.
డీజీపీకి టీఆర్ఎస్ ఫిర్యాదు…
రేపే పోలింగ్ జరగనుండటంతో పార్టీల మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది. హైదరాబాద్‌లో అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కుట్ర పన్నిందని డీజీపీకి టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రగతిభవన్, తెలంగాణ భవన్, డీజీపీ ఆఫీస్ కార్యాలయాలను ముట్టడించేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుందని తెలిపారు.
రేపు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ కుట్ర.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS పిలుపు. #DubbakaWithTRS #VoteForCar pic.twitter.com/gbStQXaXMu
— BRS Party (@BRSparty) November 1, 2020
రేపు హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీజేపీ భారీ కుట్రలు చేసే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా అల్లర్లు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ డిజిపి మహేందర్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు. pic.twitter.com/RD1krPpiaw
— BRS Party (@BRSparty) November 1, 2020
ఖండించిన బీజేపీ…
అయితే దీనిపై బీజేపీ నేత ఎమ్మెల్సీ రాంచందర్ రావు స్పందిస్తూ తాము దాడులు చేస్తున్న విషయం తమ పార్టీకే తెలియదనే, మరీ ఆ విషయం టీఆర్ఎస్ పార్టీకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. నిరసనలు తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలిపారు. తమది కుట్రలు చేసే పార్టీ కాదన్నారు. ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని అధికార పార్టీపై ఆయన మండిపడ్డారు. తమ గెలుపును అడ్డుకునేందుకే ఇలాంటి ఆరోపణలను అధికార పార్టీ చేస్తుందని ఆయన తెలిపారు.











